NDA Candidate for Vice Presidential Election: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్.. ప్రకటించిన నడ్డా.. ఇంతకీ ఎవరీయన
CP Radhakrishnan as NDA candidate: జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి NDA అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు.

Maharashtra Governor CP Radhakrishnan | న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ ప్రకటించింది. ఆదివారం (ఆగస్టు 17, 2025) జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలు అందిస్తున్న సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జెపి నడ్డా ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మద్దతు ఇచ్చారు. జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, "ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మేం ఎన్డీఏతో నిలబడతాము" అన్నారు.
ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నాం...
తదుపరి ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం, దీని కోసం మేం ప్రతిపక్ష నాయకులను సంప్రదించామని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో జగదీప్ ధంఖర్ జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు, ఆ తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనే దానిపై పలువురి పేర్లు ప్రచారం జరిగాయి.
NDA announces Maharashtra Governor CP Radhakrishnan as its candidate for the Vice Presidential election pic.twitter.com/IQhoLVXm1u
— ANI (@ANI) August 17, 2025
త్వరలో మహారాష్ట్రకు కొత్త గవర్నర్ రావచ్చు. రాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయగా.. త్వరలో రాష్ట్ర గవర్నర్ పదవిని మరొక సీనియర్ నాయకుడికి అప్పగించనున్నారు. ప్రధాని మోదీ రాధాకృష్ణ పేరును ఆమోదించినట్లు సమాచారం.
గత ఏడాది మహారాష్ట్ర గవర్నర్‌గా నియామకం
చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను గత ఏడాది మహారాష్ట్ర 24వ గవర్నర్‌గా నియమించారు. నేడు జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆయనను అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఎన్డీఏ ఆయనను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఎంపిక చేసినందున, మహారాష్ట్రకు త్వరలో కొత్త గవర్నర్ రావచ్చు.
ఎవరీ సి.పి. రాధాకృష్ణన్
సీపీ రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుపూర్‌లో 1957 మే 4న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఆయనకు తమిళనాడులో నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో ప్రారంభించి, 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు.
సి.పి. రాధాకృష్ణన్ 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శి అయ్యారు. 1998, 1999లలో జరిగిన ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో న్యూయార్క్‌లో పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి రాధాకృష్ణన్ ప్రసంగించారు. అనంతరం 2004-2007 వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు.
జార్ఖండ్ గవర్నర్‌గా సేవలు
అప్పట్లో సాగర్ మాల ప్రాజెక్ట్, సమాన పౌర స్మృతి, ఉగ్రవాదం నిర్మూలన, మాదకద్రవ్యాల సమస్య, అంటరానితనం నిర్మూలన వంటి వివిధ సామాజిక సమస్యలపై రాధాకృష్ణన్ 19 వేల కిలోమీటర్ల భారీ రథయాత్ర నిర్వహించారు. వివిధ పార్టీలు, అధికార పదవుల్లో పనిచేసిన తర్వాత రాధాకృష్ణన్‌ను ఫిబ్రవరి 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గత ఏడాది మహారాష్ట్ర గవర్నర్‌గా అయినప్పటినుంచి అక్కడే సేవలు అందిస్తున్నారు.






















