One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సాధ్యం అవుతుందా?
జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తుపై చర్చించనుంది.
![One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సాధ్యం అవుతుందా? Law Commission meeting today to discuss over One nation one election One Nation One Election: నేడు లా కమిషన్ కీలక భేటీ! వన్ నేషన్ - వన్ ఎలక్షన్ సాధ్యం అవుతుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/27/9ee66c4d52cebc733125035f035c80731695788521360840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఒకేసారి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తుపై చర్చించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్స్‌పై లా కమిషన్తన వైఖరి స్పష్టం చేయనుంది. జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలు, ప్రభుత్వ ఖజానాను భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావిస్తోంది. తరచు ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతోందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ అంచనా వేస్తోంది.
పోక్సో చట్టం కింద పిల్లల కనీస వయస్సును సైతం లా కమిషన్ నిర్థారించనుంది. లైంగిక నేరాల విషయంలో మైనర్లుగా నిర్థారించే వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది. ఆన్‌లైన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై లోతుగా, సుదీర్ఘంగా చర్చించి...నివేదికను కేంద్రానికి అందజేయనుంది లా కమిషన్.
మరోవైపు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన జమిలి ఎన్నికల కమిటీ, తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయలను స్వీకరిస్తామని చెప్పింది. దీంతో పాటు లా కమిషన్ సలహాలను సైతం తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్యాచరణ ప్రణాళికలు, అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశాలపై కమిటీ చర్చించింది. కేంద్రం నిర్దేశించిన పనులకు పేపర్ వర్కు తయారు చేయడం, అవసరమైన విషయాలపై లోతైన పరిశోధనలు చేయడంపై చర్చలు జరిగినట్లు తెలిసింది.
జమిలి ఎన్నికల సాధ్యానికి అవసరమయ్యే రాజ్యాంగ సవరణలు, వాటికి రాష్ట్రాల అంగీకారం అవసరమా.. ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యంకాకపోతే.. కాలవ్యవధులపై సిఫార్సులు వంటి పనులను కేంద్రం.. కమిటీకి నిర్దేశించింది. వీటితోపాటు జమిలి ఎన్నికలకు పెద్దమొత్తంలో అవసరమయ్యే ఎన్నికల పరికరాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. 1952 నుంచి కొన్నేళ్లు ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించి మధ్యలో ఆ పద్ధతి మారడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అలాంటిది మళ్లీ పునరావృతం కాకుండా ఏం చేయాలో ప్రతిపాదనలు సూచించాలని కమిటీకి సూచించింది కేంద్రం.
ఒకే దేశం- ఒకే ఎన్నికలు నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు .. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు. అయితే కమిటీలో కాంగ్రెస్ MP అధీర్ రంజన్ చౌదరి పేరును కేంద్రం సిఫార్సు చేసినా.. తాను ఉండబోనని చెప్పారు. కమిటీ స్వతంత్రంగా ఉండదని, కేంద్రం చెప్పినట్లే వింటుందని అనుమానం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)