Kerala Train Attack: కేరళ రైలు దాడి ఘటనలో అనుమానితుడి గుర్తింపు, ఊహాచిత్రం విడుదల చేసిన పోలీసులు
Kerala Train Attack: కేరళలో అలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌లో పెట్రోల్ దాడికి పాల్పడిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన షారుక్ సైఫీగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Kerala Train Attack : అలప్పుజా - కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌లో తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనుమానితుడిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన షారుక్ సైఫీ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుడి గుర్తింపును వారు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. నేరం ముందస్తు ప్రణాళికతో జరిగిందని, దీనిని ఉగ్రవాద కోణం ఉందా అనే దిశగా కూడా ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని పోలీసులు ప్రకటించారు.
కోజికోడ్‌లోని ఎలత్తూర్ సమీపంలో అలప్పుజా - కన్నూర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 16307) D1 కంపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పెట్రోల్ చల్లి పలువురు ప్రయాణికులకు నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మంటల నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలు నుంచి దూకి ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా, తొమ్మిది మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు మలప్పురం క్రైం బ్రాంచ్ ఎస్పీ పి.విక్రమన్ నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సోమవారం కన్నూర్‌లో పర్యటించి సీనియర్ పోలీసు అధికారులతో చర్చలు జరిపిన రాష్ట్ర పోలీసు చీఫ్.. డీజీపీ అనిల్ కాంత్ మాట్లాడుతూ.. ఎడీజీపీ (లా అండ్ ఆర్డర్) దర్యాప్తును పర్యవేక్షిస్తారని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన షారుక్ సైఫీ దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ దారుణం ముందస్తు ప్రణాళికతో జరిగిందని, దీని వెనుక ఉన్న అన్ని కోణాలను ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని పోలీసులు ప్రకటించారు. అనుమానితుడు ఇటీవలే రాష్ట్రానికి చేరుకున్నాడని, దాడికి పాల్పడటం వెనుక అతని ఉద్దేశాన్ని నిర్ధారించడానికి అతని నేపథ్యంపై దర్యాప్తు కొనసాగుతోందని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు సాక్షులు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు.
బ్యాగ్‌లో దొరికిన నోట్‌బుక్‌లో ఎలాంటి వివరాలు లేనప్పటికీ, సిమ్ కార్డులేని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు నిందితుడి గుర్తింపుపై పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. నోట్‌బుక్‌లో కేరళలోని అనేక ప్రాంతాల పేర్లను ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఆ బ్యాగ్‌లో పెట్రోల్ లాంటి ద్రవం, దుస్తులు, లంచ్ బాక్స్, కళ్లజోడు కూడా ఉన్నాయి.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వంటి సంస్థలు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. కోజికోడ్ కన్నూర్ సెక్షన్‌లోని ఎలత్తూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని కోరాపుజా వంతెన వద్దకు రైలు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, దాడి చేసిన వ్యక్తి తన చేతుల్లో రెండు మండే లక్షణాలున్న ద్రవ బాటిళ్లను పట్టుకుని.. డీ1 కంపార్ట్‌మెంట్‌లోకి నడిచి, సహ ప్రయాణీకులపై చల్లి వారికి నిప్పంటించాడు. ప్రమాదాన్ని గమనించి ఎవరో అలారం లాగి ఆపడంతో నిందితుడు రైలు దిగి తప్పించుకున్నాడు. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఎలత్తూరు యార్డు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రయాణికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు కన్నూర్‌లోని మట్టన్నూరు పలోట్టుపల్లికి చెందిన రహమత్ (45), ఆమె మేనకోడలు సహారా (2), మట్టన్నూరుకు చెందిన నౌఫీక్ (42)గా గుర్తించారు.
కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, మరణించిన ముగ్గురికి కాలిన గాయాలు లేవు. వారు కదిలే రైలు నుంచి దూకి గాయాలపాలై మరణించినట్లు అనుమానిస్తున్నారు. కాలిన గాయాలైన ఎనిమిది మంది ప్రయాణికులను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి, బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో నలుగురిని ఐసీయూలో చేర్చగా, 35శాతం కాలిన గాయాలైన అనిల్‌కుమార్ (52) పరిస్థితి విషమంగా ఉంది. మెడికల్ కాలేజీలో చేరిన వారిలో అనిల్‌కుమార్ భార్య సజిషా (42), కుమారుడు అద్వైద్ (21), అశ్వతి (29), రూబీ (52) ఉన్నారు. జ్యోతీంద్రనాథ్ (50), ప్రకాశన్ (52), ప్రిన్స్ టి యు బేబీ మెమోరియల్ ఆసుపత్రిలో చేరారు. కోజికోడ్ రైల్వే పోలీసులు ఐపీసీ సెక్షన్లు 307, 326 A, 436, 438తో పాటు రైల్వే చట్టంలోని 151 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.