BJP Candidates List: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 189 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన బీజేపీ
BJP Candidate List 2023 Karnataka: సుదీర్ఘ కసరత్తు అనంతరం బీజేపీ కర్ణాటక ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్ లో 189 పేర్లు ఖరారు చేసింది.
BJP Candidate List 2023 Karnataka:కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నాటు నాటు స్టెప్పులతో ప్రచారాలు, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు హామీలు ఇలా పార్టీలు ప్రచార స్పీడ్ పెంచాయి. అయితే అభ్యర్థుల కసరత్తు పార్టీలకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. దాదాపు మూడు రోజుల కసరత్తు అనంతరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో 189 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసింది. కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్న విషయం తెలిసిందే.
షిగ్గాం నుంచి సీఎం బొమ్మై పోటీ
భారతీయ జనతా పార్టీ మంగళవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 189 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండగా... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగ్లూరు స్థానానికి పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల ఖరారుపై పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు మూడు రోజుల చర్చల అనంతరం తొలి జాబితా విడుదల అయింది.
52 మంది ప్రెషర్స్ కు ఛాన్స్
కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితాలో 52 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారు. 32 మంది ఓబీసీ అభ్యర్థులు, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు ఛాన్స్ దక్కింది. డాక్టర్లు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, 31 మంది పీజీ అభ్యర్థులు, ఎనిమిది మంది మహిళలు తొలి జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలో ఐదుగురు న్యాయవాదులు, తొమ్మిది మంది వైద్యులు, ముగ్గురు విద్యావేత్తలు, ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ముగ్గురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలు ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. కనక్‌పురా స్థానం నుంచి పోటీ చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో రెవెన్యూ మంత్రి ఆర్.అశోక పోటీ పడనున్నారు. వరుణ స్థానంలో మాజీ సీఎం సిద్ధరామయ్యపై బీజేపీ నేత, మంత్రి వి.సోమన్న పోటీచేస్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర శికారిపుర స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మంత్రి శ్రీరాములు బళ్లారి రూరల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హిజాబ్ వివాదంలో యాక్టివ్ గా ఉన్న యశ్‌పాల్ సువర్ణకు ఉడిపి టికెట్ దక్కింది.
అభ్యర్థుల ఖరారుపై తీవ్ర చర్చ
దిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది. మే 10న సింగిల్ ఫేజ్ లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Karnataka polls: 52 fresh faces in BJP's first list of 189 candidates
— ANI Digital (@ani_digital) April 11, 2023
Read @ANI Story | https://t.co/XQ6cJJf1Gk#karnatakapolls #KarnatakaAssemblyElections2023 #BJP pic.twitter.com/5TVPg1tmgw