UNGA: ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్థాన్.. ఐరాసలో జైశంకర్ పవర్ఫుల్ స్పీచ్.. పలు దేశాలు మద్దతు
ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం పాకిస్థాన్ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్‌ను మరోసారి కడిగిపారేశారు.

Jaishankar Speech In UNGA: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను మరోసారి కడిగిపారేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని అభివర్ణించారు. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య (UNGA) 80వ సమావేశంలో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. పాకిస్తాన్‌ను ‘ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం’ అని అన్నారు. జైశంర్ మాట్లాడినంత సేపు ప్రపంచ దేశాల సభ్యులు తమ చప్పట్లతో ఆయనకు మద్దతుగా నిలిచారు.
ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా పరిగణిస్తోంది
‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జరిగిన ఉన్నత స్థాయి జనరల్ డిబేట్‌లో జైశంకర్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసంగించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ విధానంగా పరిగణిస్తోందని విమర్శించారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద సవాల్‌ను ఎదుర్కొంటోందని, పొరుగు దేశంగా ఉన్న తమపై దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
#WATCH | At the 80th session of UNGA, EAM Dr S Jaishankar says, "India has confronted this challenge since its independence, having a neighbour that is an epicentre of global terrorism. For decades now, major international terrorist attacks are traced back to that one country.… pic.twitter.com/WNV5pJDnFe
— ANI (@ANI) September 27, 2025
ప్రపంచ ఉగ్రవాదుల లిస్ట్ పాకిస్థానీలతో నిండి ఉంది
“ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ ఉగ్రవాదుల జాబితా పాకిస్థాన్ జాతీయులతో నిండి ఉంది. ఇందుకు తాజా ఉదాహారణే పహల్గాం ఉగ్ర దాడి. ఏప్రిల్‌లో పహల్గాంలో అత్యంత పాశవిక ఉగ్రదాడి చేసి 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారు.” అని జయశంకర్ అన్నారు. “దీంతో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి తన ప్రజలను రక్షించుకునే హక్కును ఉపయోగించుకుంది. దాడి చేపట్టిన నిర్వాహకులు, నేరస్థులకు బుద్ధి చెప్పి బాధితులకు న్యాయం చేశాం” అని అన్నారు.
ఆ దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఉగ్రవాదాన్ని అణచివేయడమే భారతదేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశ మంత్రి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం అనేది మతోన్మాదం, హింస, అసహనాన్ని ప్రేరేపిస్తుందని అన్నారు. ఉగ్రవాదులకు రక్షణ, షెల్టర్ ఇస్తూ వారికి స్వర్గధామంలా నిలుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జైశంకర్ గ్లోబల్ కమ్యూనిటీని కోరారు.
నిస్సంకోచంగా ఖండించాలి
‘‘దేశాలు బహిరంగంగా ఉగ్రవాదాన్ని తమ స్టేట్ పాలసీగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాద కేంద్రాలు పారిశ్రామిక స్థాయిలో నడుస్తున్నప్పుడు, ఉగ్రవాద కార్యకలాపాలు బహిరంగంగా జరుపుకున్నప్పుడు అటువంటి చర్యలను సంకోచం లేకుండా ఖండించాలి’’ అని జైశంకర్ నొక్కి చెప్పారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌ను అరికట్టాలని, హైప్రొఫైల్ ఉగ్రవాదులపై తీవ్ర ఆంక్షలు విధించాలని కోరారు.
తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
ఉగ్రవాదం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జైశంకర్ హెచ్చరించారు. ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు కాబట్టి, దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాలని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో సభ్య దేశాలు ఐక్యంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. జైశంర్ ప్రసంగానికి UNGA ప్రతినిధుల విశేష మద్దతు లభించింది. ఆయన ప్రసంగించినంత సేపు తమ చప్పట్లతో మద్దతు తెలిపారు. ఆయన మాటల తీవ్రత ఉగ్రవాద వ్యాప్తిపై ప్రపంచ దేశాల ఆందోళనను నొక్కిచెప్పాయి.





















