Operation Karre Guttalu: మావోయిస్టులకు పెట్టని కోట కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుసా ?
Encounter | ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ కొండ ప్రాంతం కర్రెగుట్ట. ఇది ప్రధానంగా ములుగు , ఛత్తీస్‌గఢ్ లోని బీజా పూర్ జిల్లా పరిధిలో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి.

మావోయిస్టులు తమ సిద్ధాంత వ్యాప్తి కోసం, తమ లక్ష్య సాధనకు అడవులు, కొండలు, గుట్టలను తమ రక్షణగా దశాబ్దాల నుంచి ఉపయోగించుకుంటున్నారు. దట్టమైన అడవి, పెట్టని కోటల్లా ఉండే కొండలు, అక్కడ దొరికే జలపాతాల నీరు, తినేందుకు అడవిలో లభించే అటవీ ఆహరంతో వారి జీవనం సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రతీ రోజు అటవీ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. రక్షణ ఇచ్చే అటవీ ప్రాంతమే కొన్ని సార్లు వారికి శత్రువుగా మారి ప్రాణాలు తీస్తుంది.
అయితే అడవిని అర్థం చేసుకుని దాంతో సహవాసం చేస్తూ అన్నలు తమ జీవితాలను కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు ఆ అడవిలోకి వారిని మట్టుబట్టేందుకు కేంద్ర పోలీసు బలగాలు అడుగుపెట్టాయి. చెట్టు, పుట్ట విడిచిపెట్టకుండా నక్సలైట్లను ఏరి వేసేందుకు ఆపరేషన్ ఖగార్ ను కేంద్ర సర్కార్ చేపట్టింది. ఈ తరుణంలో మనకు ప్రతీ రోజు మీడియాలో వినిపిస్తున్న పేరు కర్రె గుట్ట . ఈ ప్రాంతం ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ బేస్ గా ఎందుకు వాడుకుంటున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
కర్రె గుట్టలకు ఆ పేరు ఎలా వచ్చింది ?
కర్రె గుట్టలకు ఆ పేరు ఆ ప్రాంతంలో నివసించే ఆదివాసి సంస్కృతి నుండి ఉద్భవించినట్లు చెబుతారు. దీనిపై ఖచ్చిమైన సమాచారం లేకున్నా. ఆదివాసీల ద్వారానే ఈ కర్రెగుట్ట అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. కర్రె గుట్టల సమీపంలోని గ్రామాల్లో ప్రధానంగా కోయ, గోండ్, చెంచు, లంబాడీ, మురియా, మరియా తెగల వారు నివసిస్తున్నారు. అయితే చారిత్రాత్మక ఆధారాలు ఏవీ లేకున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు, గుహలు, కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం అన్నిటిని సూచించే విధంగా కర్ర, కరకు, లేదా గట్టి అనే అర్థం వచ్చేలాఈ ప్రాంతానికి కర్రె గుట్ట అని వచ్చినట్లు కొంత సమాచారం ఉంది. అయితే ఇలానే ఆ పేరు పుట్టిందన్న సమాచారం మాత్రం అందుబాటులో లేదు. కొండ, గుట్ట ప్రాంతంకు ఉన్న దృఢత్వాన్ని సూచించేలా ఉందనడంలో సందేహం లేదు. ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలను ఆదివాసీలు వివరించేందుకు ఇలా పిలిచి ఉండవచ్చని తెలుస్తోంది.
శత్రు దుర్భేద్యంగా కర్రె గుట్టల ప్రాంతం
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ కొండ ప్రాంతం కర్రెగుట్ట. ఇది ప్రధానంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం సరిహద్దు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పరిధిలో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా చిక్కటి అటవీ ప్రాంతం . అంతే కాదు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద కొండల శ్రేణి విస్తరించి ఉంది. పెద్ద గుహలు, సొరంగరాలతో నిండి ఉంది. వాగులు, వంకలతో కర్రె గుట్ట నిండి ఉంది. ఈ కొండలు సముద్ర మట్టం నుండి సుమారు ఐదు వేల అడుగుల ఎత్తు అంటే 1524 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయి.
పెట్టని కోటల్లా, శత్రు దుర్బేధ్యంగా ఈ కొండల శ్రేణి రుద్రారం నుండి దాదాపు 90 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సరిహద్దు ప్రాంతం, ఇక్కడ నుండి చత్తీస్ ఘడ్ లోని కొత్తపల్లి, కస్తూరి పాడు, చిన ఉట్ల పల్లి, బీమారం పాడు, పెద్ద ఊట్ల పల్లి, గుంజపర్తి, పూజారికాంకేర్, నంబి, నడిపల్లి, ఎలిమిడి, గల్గం ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న గుట్టలే కర్రె గుట్టలు. ఈ ప్రాంతం అంతా బండ రాళ్లతో , అటవీ వనలాతో, పెద్ద గుహలతో నిండి ఉన్న ప్రాంతం.
మావోయిస్టుల బేస్ గా కర్రె గుట్టలు
ఈ కర్రె గుట్టల ప్రాంతాన్ని దాదాపు 45 ఏళ్ల నుండి మావోయిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. 1980 లలో నక్సలిజం దేశ మంతా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఇటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీలలోను వ్యాప్తి చెందింది. రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ కర్రె గుట్టల ప్రాంతం నక్సలైట్లకు శత్రు దుర్భేద్యమైన ప్రాంతంగా ఉండటంతో ఇది కీలకమైంది. 2004లో మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడంతో ఈ స్థావరం మావోలకు కీలక స్థావరమైంది. ఇక్కడ తమ క్యాంపు ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయుధాల తయారీ, మిలటరీ శిక్షణ , పార్తీ విస్తరణకు కేంద్ర బిందువుగా మారింది.
ఆపరేషన్ ఖగార్ తో వెలుగులోకి వచ్చిన కర్రె గుట్టలు
ఈ కర్రె గుట్టలపై కేంద్ర సర్కార్ భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగుర వేశాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. యుద్దంలో ఏదైనా ప్రాంతాన్ని సైనికులు స్వాధీం చేసుకుంటే ఆ ప్రాంతంలోని ఎత్తైన స్థలంలో గాని, అక్కడి రాజ కోట మీద గాని, లేదా అతి పెద్ద నిర్మాణాలపై స్వాధీనం చేసుకున్న సైనికులు తమ జెండాను విజయకేతనానికి చిహ్నంగా ఎగుర వేస్తారు. కర్రె గుట్టలపై భద్రతా బలగాలు జాతీయ జెండాను ఎగురవేయడం అంటే సుదీర్ఘ కాలంగా మావోయిస్టుల చేతుల్లో ఉన్న ఈ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో మన జాతీయ పతాకాన్ని ఎగురవేశారని అర్థం చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సీఆర్పీఎఫ్, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు, కోబ్రా దళాలు దాదాపు 24 వేల మంది ఈ ఆపరేషన్ ఖగార్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధాలు, బాంబులను నిర్వీర్యం చేసే నిపుణు, అందుకు అవసరమైన సాధనా సంపత్తి, స్మోక్ బాంబులతో ఈ భద్రతా బలగాలు మావోయిస్టులను భౌతికంగా మట్టుపెట్డడంతో పాటు, ఈ ప్రాంతం వారి చేతుల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతున్నట్లు చెబుతున్నారు.






















