Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం
Women Freedom Struggle: స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వారితో పాటు ఎంతో మంది ధీర వనితలు తెగించి కొట్లాడారు, ఎన్నో త్యాగాలు చేశారు.
Women Freedom Struggle: దేశ స్వాతంత్ర్య పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు ఎందరో. మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలతో సమానంగా మహిళలూ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. పురుషులతో పాటు సమానంగా పోరాడారు. స్వతంత్ర్య సాధనలో కీలక భూమిక పోషించారు.
ఆద్యంతం స్వతంత్ర్య సంగ్రామంలో వనితలు
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు మొదటి నుంచీ ఉన్నారు. ఆఖరి వరకు పోరాడారు. 1857లో తిరుగుబాటు సమయంలో పురుషులకు సరిసమానంగా పని చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు ముందుండి పోరాడితే.. వారి వెనక ఉండి ధైర్యాన్ని నూరిపోసిన వారు లెక్కకు మిక్కిలే ఉంటారు. ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా వంటి మహిళా సంస్థలు మహిళల హక్కుల సమస్యలపై అవగాహన కల్పించడంలో స్వేచ్ఛకు మద్దతుగా మహిళలను సమీకరించడంలో ప్రధాన పాత్ర పోషించాయి.
సహాయ నిరాకరణ ఉద్యమంలో మహిళలు
1920-22 నాటి సహాయ నిరాకరణ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో స్త్రీల భాగస్వామ్యం పెద్ద ఎత్తున పెరిగింది. అన్ని వర్గాల మహిళలు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మద్యం దుకాణాలను పికెట్ చేయడం, బ్రిటీష్ వస్తువులను బహిష్కరించారు. జైలుకు కూడా వెళ్లారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళలు
1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళలు మరింత ఎక్కువగా స్వాతంత్ర్యం పోరాటంలో పాలుపంచుకున్నారు. ఏఐడబ్ల్యూసీ, ఎన్‌సీడబ్ల్యూఐ వంటి మహిళా సంఘాలు మహిళలను ఉద్యమంలో సమీకరించడంలో కీలకపాత్ర పోషించాయి. మహిళలు కూడా అండర్ గ్రౌండ్ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. సందేశాలను మోసుకెళ్లారు. స్వాతంత్ర్య సమరయోధులను దాచిపెట్టారు. యుద్ధంలో బ్రిటీష్ వారిపై పోరాడారు.
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహిళల్లో కొంతమంది
సరోజినీ నాయుడు
కవి, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు స్వతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో ముఖ్యులు. ఆమె ప్రసంగాలకు జనాలు ఉర్రూతలూగిపోయేవారు. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించడంలో సరోజినీ నాయుడు దిట్ట.
లక్ష్మీబాయి తిలక్
బాల గంగాధర్ తిలక్ భార్యే లక్ష్మీబాయి తిలక్. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలు పోరాట చరిత్రలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. బాల గంగాధార్ తిలక్ వెనక ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు.
అరుణా అసఫ్ అలీ
విప్లవకారురాలు, సామాజిక కార్యకర్త. అరుణా అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కీలకంగా వ్యవహరించారు. ఆమె ప్రసంగాలతో జనంలో స్వతంత్ర్య కాంక్షలు రగిలించే వారు. అలుపెరగని పోరాటంతో స్వాతంత్రోద్యమంలో కీలకంగా వ్యవహరించారు.
కస్తూర్బా గాంధీ
మహాత్మా గాంధీ భార్యే కస్తూర్బా గాంధీ. తన భర్త ఆశయానికి గట్టిగా మద్దతు ఇచ్చారు. గాంధీ అహింసాయుతంగా పోరాటం చేయడంలో ఇంటి నుంచి పూర్తిగా మద్దతు ఇచ్చారు. చాలా పోరాటాల్లో ఆమె కూడా పాల్గొన్నారు.
మాతంగిని హజ్రా
బెంగాల్ కు చెందిన ఓ మహిళా రైతు మాతంగిని హజ్రా. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో మాతంగిని హజ్రా చూపిన ధైర్యసాహసాలతో గొప్ప పేరు సంపాదించారు. నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన ఆమెను బ్రిటీష్ బలగాలు కాల్చి చంపాయి.