Allahabad High Court: సహజీవనం చేసి ప్రియుడిపైనే కోర్టుకు వెళ్లిన మహిళ - అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక విషయంలో వివాహిత అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, పురుషుడితో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఏకాభిప్రాయం లేనిదని భావించలేమని పేర్కొంది.
Allahabad High Court: అలహాబాద్ హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక అనుభవం ఉన్న పెళ్లైన మహిళ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే, పురుషుడితో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఏకాభిప్రాయం లేనిదని భావించలేమని పేర్కొంది. 40 ఏళ్ల వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇందులో నిందితుడు ఆమెతో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉన్న వ్యక్తి కావడం గమనార్హం.
ఓ 40 ఏళ్ల వివాహిత తన భర్త నుంచి విడాకులు తీసుకోకుండా, తన ఇద్దరు పిల్లలను విడిచిపెట్టకుండా, రాకేష్ యాదవ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. దాదాపు వీరు 5 నెలలు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని ఆమె రాకేష్‌ను కోరింది. అయితే అతను అందుకు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా రాకేష్, అతని సోదరుడు రాజేష్, తండ్రి లాల్ బహుదూర్‌పై కేసు పెట్టింది. వారిపై జూన్‌పూర్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లోని అదనపు సివిల్ జడ్జి కోర్టులో చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దీనిని కొట్టివేయాలని కోరుతూ రాకేష్, అతని సోదరుడు, తండ్రి హైకోర్టులో పిటిషన్‌ను వేశారు.
దీనిపై వివాహిత తరఫున న్యాయవాది వాదిస్తూ.. భార్యభర్తల మధ్య సఖ్యత లేమిని రాకేష్ యాదవ్ (మొదటి దరఖాస్తుదారు) ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన రాకేష్ మాటలు నమ్మి అతనితో ఐదు నెలల పాటు సహజీవనం చేశాడని, రాకేష్ యాదవ్‌తో పెళ్లికి అతని తండ్రి లాల్ బహుదూర్, సోదరుడు రాజేష్ యాదవ్ హామీ ఇచ్చారని అన్నారు. నోటరీ ద్వారా వివాహం జరిగిందని నమ్మించేందుకు సాధారణ స్టాంప్ పేపర్‌పై ఆమె సంతకాన్ని తీసుకున్నారని ఆరోపించారు. అయితే నిజానికి, అలాంటి వివాహమేదీ జరగలేదన్నారు.
దీనికి రాకేష్ కుమార్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 40 ఏళ్ల వివాహిత, ఇద్దరు పిల్లల తల్లికి ఆలోచన సామర్ధ్యం ఉంటుందని, ఏకాభిప్రాయంతోనే సహజీవనం చేశారని వాదించారు. ఈ కేసు అత్యాచారం కాదని, రాకేస్, వివాహిత మధ్య ఏకాభిప్రాయంతోనే సంబంధం ఏర్పడిందన్నారు.
దీనిపై కోర్టు విచారణ జరిపిన న్యాయస్థానం.. అత్యాచారానికి గురైన బాధితురాలు తన భర్త నుంచి విడాకులు తీసుకోకుండా, తన ఇద్దరు పిల్లలను విడిచిపెట్టకుండా, పిటిషనర్ రాకేష్ యాదవ్‌ను వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అతనితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించిందని కోర్టు పేర్కొంది. రాకేష్ కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసును సస్పెండ్ చేసింది. వారికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరువారాల సమయం ఇచ్చింది. తొమ్మిది వారాల తర్వాత ఈ కేసు తదుపరి విచారణకు రానుంది.
సహజీవనంపై గతవారం సంచలన వ్యాఖ్యలు
గతవారం సహజీవనంపై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 18 ఏళ్ల లోపు ఉన్న వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక్కరైనా మైనర్ ఉంటే అది అనైతికమని వెల్లడించింది. ఓ మైనర్.. మేజర్‌తో సహజీవనం చేస్తూ.. చట్టం నుంచి రక్షణ పొందలేరని వ్యాఖ్యానించింది. వారు చేసే పని చట్టపరమైంది కాదని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.