I.N.D.I.A కూటమి గెలవకపోతే దేశమంతా మణిపూర్‌లా మారుతుంది: ఎంకే స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు
MK Stalin on BJP: వచ్చే ఎన్నికల్లో I.N.D.I.A కూటమి విజయం సాధించకపోతే దేశం పూర్తిగా మణిపూర్, హర్యానాలాగా మారిపోతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు.
MK Stalin About I.N.D.I.A:
సనాతన ధర్మాన్ని రూపుమాపాలంటూ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలకు దిగారు. స్టాలిన్ తన పాడ్‌కాస్ట్ సిరీస్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో I.N.D.I.A కూటమి విజయం సాధించకపోతే దేశం పూర్తిగా మణిపూర్, హర్యానాలాగా మారిపోతుందని విమర్శించారు. మణిపూర్‌లో గత కొంత కాలంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు, హర్యానాలో ఇటీవల ఓ మతపరమైన ర్యాలీ సందర్భంగా జరుగుతున్న గొడవల కారణంగా ఎంకే స్టాలిన్ ఈ రెండు రాష్ట్రాల అంశాలను ప్రస్తావించారు.
బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం, తమ కావాల్సిన వారికి వాటిని అప్పగించడం, ఎయిర్‌ఇండియాన విక్రయించడం లాంటి పనులకు కప్పిపుచ్చుకునేందుకు మతపరమైన అంశాలను లేవనెత్తుతోందని స్టాలిన్ ఆరోపించారు. భారత్‌ను వివిధ సంస్కృతులతో కూడిన వైవిధ్యభరితమైన దేశంగా రూపొందించాలని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం మతతత్వాన్ని తెరపైకి తెస్తోందని దుయ్యబట్టారు. అలాగే ఆయన 2002 గుజరాత్ అల్లర్ల గురించి కూడా ప్రస్తావించారు. వారి ద్వేషాన్ని అవి తెలియజేస్తాయని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు 2023లో మణిపూర్, హర్యానాలో మతపరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
I.N.D.I.A కూటమి సామాజిక న్యాయం, సామాజిక సామరస్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం పునరుద్ధరణ కోసం ఏర్పడిందని, ఇప్పుడు దేశాన్ని రక్షించలేకపోతే ఇక ఎవ్వరూ కాపాడలేరని స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫెడరలిజానికి ముప్పు వచ్చినప్పుడల్లా డీఎంకే ముందుంటుందని చెప్పుకొచ్చారు. మతం, కులం, భాషల ఆధారంగా దేశాన్ని డీఎంకే విభజించదంటూ బీజేపీపై విమర్శలు చేశారు.
స్పీకింగ్ ఫర్ ఇండియా పేరుతో స్టాలిన్ ఈరోజు ఉదయం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ నాలుగు భాషల్లో పోడ్‌కాస్ట్ రిలీజ్ చేశారు. గత తొమ్మిదేళ్లలో సాంఘిక సంక్షేమానికి బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని స్టాలిన్ ఇందులో ఆరోపించారు. వాగ్దానం చేసినట్లు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమ కాలేదు, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు అని విమర్శలు చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా తీవ్రంగా స్పందించింది. పోడ్‌కాస్ట్‌లో ఆయన వాదనలు అబద్ధమని పార్టీ పేర్కొంది. ప్రధానమంత్రి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు.
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయనన్ తిరుపతి మాట్లాడుతూ.. ఫెడరలింజంపై దాడిని తిప్పికొడుతూ తమిళనాడుకు బీజేపీ ప్రభుత్వం పన్ను రాబడిలో రావాల్సిన వాటాను ఇచ్చిందని అన్నారు. కనీసం స్టాలిన్ ఇప్పుడైనా భారతదేశాన్ని ఒక దేశంగా అంగీకరించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
స్టాలిన్ ఈ పాడ్‌కాస్ట్‌ను బీజేపీ హయాంలో భారతదేశ విధ్వంసం అని హైలెట్ చేస్తూ ప్రారంభించారు. ప్రతిపక్ష కూటమి సమాతన్వం, సామరస్య పూర్వక భారతదేశాన్ని నిర్మించాలనుకుంటుందని స్టాలిన్ పేర్కొన్నారు. స్టాలిన్ చేస్తున్న ఈ ప్రోగ్రాం ఆయన పొలిటికల్ కమ్యూనికేషన్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించే దిశగా, ముఖ్యంగా I.N.D.I.A కూటమి నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించేందుకు ఈ పోడ్‌కాస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అధికార డీఎంకే కూటమి 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో 39 సీట్లలో 38 స్థానాలను గెలుచుకుంది. అలాగే పొరుగున్న ఉన్న పుదుచ్ఛేరిలోని ఒక ఎంపీ సీటును కూడా సాధించింది.