Benguluru murder case: సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండీ, సీఈఓ హత్యకు ముందు ఫెలిక్స్ సంచలన పోస్ట్, వెలుగులోకి కీలక వివరాలు
బెంగుళూరు ఐటీ కంపెనీ ఎండీ, సీఈఓ హత్యకు ముందు నిందితుడు ఇన్ స్టాగ్రాంలోనే ముందస్తు సమాచారం ఇచ్చాడు. తాను చెడ్డ వారిని మాత్రమే బాధపెడతానంటూ చేసిన పోస్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది.
Benguluru murder case: ఈశాన్య బెంగళూరులో అమృతహళ్లి ప్రాంతంలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లోని ఓ ఐటీ ఆఫీసులో జరిగిన హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హత్యకు ముందే నిందితుడు సమాచారం ఇచ్చాడు. తాను చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధపెట్టానని, మంచి వ్యక్తులను అసలు హింసించలేదంటూ ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్ట్ ద్వారా సందేశం ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫెలిక్స్ సహా మరో ఇద్దరు అరెస్ట్...
ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఫణీంద్ర సుబ్రహ్మణ్య(36), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)విను కుమార్(40)లను బెంగళూరులో శబరీష్ అలియాస్ ఫెలిక్స్ అనే మాజీ ఉద్యోగి పట్టపగలు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పేరు ఫెలిక్స్. ఈ దారుణ ఘటన మంగళవారం అమృతహళ్లిలో ఉన్న పంపా ఎక్స్ టెన్షన్ లో మధ్యాహ్నం 3.45 నుంచి 4 గంటల మధ్య చోటుచేసుకుంది. మంగళవారం కంపెనీలోకి ప్రవేశించిన ఫెలిక్స్ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో ఎండీ, సీఈఓలు ఇద్దరిని నరికాడు. తీవ్రంగా గాయపడ్డ వీద్దరినీ కంపెనీ ఇతర ఉద్యోగులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే వీరు ప్రాణాలు కోల్పోయారు. అయితే హత్యకు ముందే ఫెలిక్స్ తన ఇన్ స్టాగ్రాం ద్వారా నిందితులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధపెడతాడని రాసుకొచ్చాడు.
బహుశా తన కంపెనీని ఎదగనివ్వకుండా తొక్కెస్తున్నారన్న కోపంతో ఫెలిక్స్ ఫణీంద్ర గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ‘ఈ గ్రహంపై ఉండే ప్రజలందరూ మోసం చేసేవారే. అందుకే నేను ఈ గ్రహంలోని ప్రజలను బాధపెడతాను. కానీ, నేను చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధించాను. ఏ మంచి వ్యక్తులను ఎప్పుడూ బాధించలేదు’ అని ఫెలిక్స్ హత్యకు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. జోకర్_ఫెలిక్స్_రాపర్_ పేరుతో అతని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు 16,600 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ వ్యక్తి తాను "ఫ్యాషన్ మోడల్", "కన్నడ రాపర్" అని కూడా పేర్కొన్నాడు. ఇక, ఈ హత్యకు సంబంధించి డీజీపీ మాట్లాడుతూ..‘ కార్యాలయంలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి పదునైన ఆయుధాలతో సుబ్రహ్మణ్యంపై దాడి చేశారు. కుమార్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అతనిపై కూడా దాడి జరిగింది’ అని డీజీపీ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. తరువాత వారు అక్కడి నుండి పారిపోయారు అని తెలిపారు. నిందితుడు ఫెలిక్స్, అతనికి సహకరించిన మరో ఇద్దరు వినయ్ రెడ్డి, సంతోష్‌లను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
ఆ సమయంలో 10 మంది ఉన్నారు....
అయితే, మంగళవారం ఏరోనిక్ ఆఫీసులో హత్య జరుగుతున్న సమయంలో ఆఫీసులో కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్నారని బెంగళూరు ఈశాన్య డిప్యూటీ కమిషనర్ (డిసిపి) లక్ష్మీప్రసాద్ తెలిపారు. 2022 నవంబర్‌లో ఏరోనిక్స్‌ను స్థాపించడానికి ముందు నిందితులు మృతులకు తెలిసిన వారని, వేరే కంపెనీలో పని చేసేవారని డీజీపీ తెలిపారు. ఇతరుల ఉద్దేశాలు, ప్రమేయంపై దర్యాప్తు జరుగుతోందని డీసీపీ తెలిపారు. కాగా, మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.