New Rules on ICU: పేషంట్ వద్దంటే ఐసీయూలో చేర్చుకోవద్దు-కేంద్రం కొత్త మార్గదర్శకాలు
రోగి నిరాకరిస్తే ఐసీయూలో చేర్చుకోవద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పేషంట్ గానీ అతని కుటుంబం గానీ నిరాకరిస్తే... ఆ రోగిని ఐసీయూలో అడ్మిట్ చేయొద్దని స్పష్టం చేసింది.
New Rules on ICU Admission: ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో పేషంట్లను చేర్చుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం (Centrel Goverment) కొత్త ఆదేశాలు జారీ చేసింది. చికిత్స కోసం రోగి అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకునేలా ఆసుపత్రులకు మార్గదర్శకాలు ఇచ్చింది. తీవ్రమైన ఆనారోగ్యంతో బాధపడుతున్న పేషంట్ లేదా వారి కుటుంబసభ్యులు అనుమతితోనే ఐసీయూ (ICU) లో చేర్చుకోవాలని ఆస్పత్రి నిర్వహకులకు తేల్చి చెప్పింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ (Patient) గానీ... లేదా అతని కుటుంబసభ్యులు (Family Members) గానీ... ఐసీయూలో అడ్మిషన్‌కు నిరాకరిస్తే... ఆ రోగిని ఆస్పత్రుల (Hospitals) యాజమాన్యాలు ఐసీయూలో అడ్మిట్ చేసుకోకూడదని స్పష్టం చేసింది. తీవ్ర అనారోగ్యం ఉన్నా.. రోగి నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బతికే అవకాశం లేనప్పుడు ఐసీయూలో ఉంచడం వృథా అని తేల్చి చెప్పారు. ఈ మేరకు నిన్న (మంగళవారం) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ (Union Health Ministry). ఐసీయూలో అడ్మిషన్లు (ICU Admissions), ట్రీట్‌మెంట్‌కు సంబంధించి కొత్త నిబంధనలు పెట్టింది.
ఐసీయూలో అడ్మిషన్లకు సంబంధించిన ఈ కొత్త నిబంధనలను క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో ప్రత్యేకత కలిగిన 24 మంది వైద్య నిపుణుల ప్యానెల్ ((24 Member Expert Committee) తయారు చేసింది. రోగిని ఐసీయూలో ఉంచాల్సిన వైద్య పరిస్థితుల జాబితాను రూపొందించింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసింది. ఐసీయూ అనేది పరిమిత వనరు అని.. ప్రతి ఒక్కరినీ అందులో చేర్చుకోవడం వల్ల.. అత్యవసర సందర్భాల్లో రోగులకు అవసరమైనప్పుడు పడకలు లభించడంలేదు. కనుక ఈ మార్గదర్శకాలు అవసరమని వైద్య నిపుణుల కమిటీ తెలిపింది. దీని వల్ల రోగి కుటుంబానికి, ఆసుపత్రి పరిపాలనకు మధ్య పారదర్శకత పెరుగుతుందని చెప్పింది. తీవ్ర ఆరోగ్య సమస్య నుంచి రోగిని కాపాడేందుకు మాత్రమే ఐసీయూలో అడ్మిషన్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ రోగి, అతడి బంధువులు నిరాకరిస్తే ఐసీయూ నుంచి సదరు రోగిని డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది.
ఐసీయూలో ఎప్పుడు చేర్చుకోకూడదు..!
తీవ్ర వ్యాధి లేదా అనారోగ్యంతో మరణం అంచులకు చేరినవారికి... మరో చికిత్స లేనప్పుడు, ప్రస్తుత చికిత్సతో వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేనప్పుడు వారిని ఐసీయూల్లో ఉంచడం వృథా అని నిపుణుల కమిటీ తెలిపింది. అలాగే.. మహమ్మారి లేదా విపత్తు పరిస్థితుల్లో పరిమిత వనరులు ఉన్నప్పుడు పేషెంట్‌ను ఐసీయూలో ఉంచటానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తదుపరి వైద్య చికిత్స సాధ్యం కానప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, అప్పటివరకు అందిస్తున్న వైద్య చికిత్సతో ఫలితం లేనప్పుడు అంటే... ముఖ్యంగా రోగి జీవించే అవకాశం లేనప్పుడు.. ఐసీయూలో చేర్చుకోవద్దని మార్గదర్శకాల్లో స్పషం చేశారు. ఆ సమయంలో... రోగి లేదా అతడి బంధువుల నిర్ణయానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. రోగి లేదా అతని కుటుంబసభ్యులు నిరాకరిస్తే.. రోగిని ఐసీయూలో చేర్చుకోరాదని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఐసీయూలో ఎప్పుడు చేర్చుకోవచ్చు..!
అవయవ వైఫల్యం, ఆర్గాన్ సపోర్ట్ అవసరమైనప్పుడు, రోగి ఆరోగ్యం విషమించే పరిస్థితులు ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత పరిస్థితి దిగజారితే.. అప్పుడు కూడా పేషెంట్‌ను ఐసీయూలో కొనసాగించవచ్చు. గుండె సమస్యలు లేదా శ్వాసకోశ వ్యవస్థ పనితీరులో హెచ్చుతగ్గులు, పెద్దస్థాయి ఆపరేషన్ చేయించుకున్న రోగులను కూడా ఐసీయూలో చేర్చుకోవచ్చు. ఇక... ఐసీయూలో రోగిని చేర్చేముందు.. బీపీ, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధానం, హృదయ స్పందన, ఆక్సిజన్ శాచురేషన్ వంటి అంశాలను పర్యవేక్షించాలి.