Himachalpradesh Floods: వరద గుప్పిట్లో హిమాచల్‌ప్రదేశ్ - రూ.3 వేల కోట్ల నష్టం, 17 మంది మృతి
Himachalpradesh Floods: కుండపోత వర్షాలు, భారీ వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Himachalpradesh Floods: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలతో, వరదలతో అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని రావి, బియాస్, సట్లెజ్, స్వాన్, చీనాబ్ సహా ఇతర ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ఇళ్లు, భారీ వాహనాలు కొట్టుకుపోతున్నాయి. వరద నీటిలో కార్లు, బస్సులు, ఇళ్లు కొట్టుకుపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని పలు చోట్ల కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు చోట్ల రహదారులు మూసుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ లో వరదల వల్ల ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు వదిలారు.
వందలాది రోడ్డు మార్గాలు ధ్వంసం
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదీతీర ప్రాంతాల్లోని వాహనాలు, ఇళ్లు, భవనాలు వరద ప్రవాహంతో పాటు కొట్టుకుపోతున్నాయి. వరదల ధాటికి అనేక వంతెనలు తెగిపోయాయి. పలు ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. రికార్డు స్థాయిలో కురుస్తున్న కుండపోత వానలకు హిమాచల్ ప్రదేశ్ వాసులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో ఆకస్మిక వరదల ఘటనలు 17 నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడి రాష్ట్రవ్యాప్తంగా 765 రోడ్లను మూసివేశారు. భారీ వర్షాలు, వరదల ధాటికి 484 నీటి సరఫరా పథకాలు దెబ్బతిన్నాయి. చండీగఢ్- మనాలి జాతీయ రహదారిపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లను బ్లాక్ చేశారు. యునెస్కో ప్రపంచవారసత్వంగా గుర్తించిన సిమ్లా-కల్కా మార్గంలో రైలు రాకపోకలను మంగళవారం వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 56 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ స్థాయిలో వర్షాలు అతలాకుతలం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వర్షాలు, వరదలతో రూ.3 వేల కోట్ల నష్టం
గత 50 ఏళ్ల కాలంలో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నడూ చూడని రీతిలో భారీ వర్షాలు పడుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల గత రెండు రోజుల్లో 17 మంది వరకు చనిపోయారని అన్నారు. చందర్తాల్, లాహౌల్, స్పితిలోని పాగల్, తేల్గి నల్లా మధ్య చిక్కుకుపోయిన 400 మంది పర్యాటకులు, స్థానికులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్, బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. రాష్ట్రంలోని బీతావహ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారని సీఎం తెలిపారు. బడ్డి, కులు, ఉనా ప్రాంతాల్లో పలు వంతెనలు ధ్వంసమయ్యాయని, కులులోని లార్గి పవర్ ప్రాజెక్టు నీటిలో మునిగిపోయిందని వెల్లడించారు.
#WATCH | Himachal Pradesh: Latest visuals from Mandi around Victoria Bridge and Panchvakhtra Temple. pic.twitter.com/1jnhmTr8V6
— ANI (@ANI) July 10, 2023
#WATCH | Portion of a bridge washed away in the Baddi Nalagarh Industrial Area of Solan amid incessant rainfall in Himachal Pradesh pic.twitter.com/qckEAcMYbR
— ANI (@ANI) July 10, 2023