Kumaraswamy: మా టార్గెట్ అది కాదు, కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ లో కేసీఆర్ తో సమావేశంపై కుమారస్వామి సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన పరిణామంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అగ్ర నేత హెచ్‌డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇద్దరం జరిపిన చర్చలు మూడో కూటమి ఏర్పాటును ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కేసీఆర్ తో సమావేశంపై కుమారస్వామి సోమవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడంలో భాగంగా కేసీఆర్ కు ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. దేశంలోని రైతులు, మౌలిక సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ వద్ద మంచి ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా అమలు చేయాలో ఆయనకు మాత్రమే తెలుసని మాట్లాడారు.
తమది ఒక చిన్న పార్టీ అయినా, తాము కేసీఆర్‌కు ఎప్పుడూ సహకరిస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కుమారస్వామి స్పష్టత ఇచ్చారు. దేశ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరు గొంతు విప్పినా అందుకు తాము సహకరిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అనివార్యంగా మారిందని అన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో లక్ష్యాలతో పని చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆ విషయంపై తాను కేసీఆర్ మాట్లాడుకున్నామని వివరించారు. ఆదివారం కేసీఆర్‌తో చర్చల అనంతరం దసరాలోగా కీలక నిర్ణయం వెల్లడిస్తామని కుమారస్వామి ప్రకటించిన విషయం తెలిసిందే.
‘‘దేశ సమస్యల పరిష్కారానికి కేసీఆర్‌కు సొంత ఆలోచన ఉంది. రైతులకు ఎలా సాయం చేయాలి, జాతీయ స్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు మా మద్దతును కోరారు. వారితో చేతులు కలపాలని ఆలోచిస్తున్నాము.’’ అని అన్నారు.
నిఖిల్ మాటను తప్పుగా అర్థం చేసుకోవద్దు
జేడీఎస్ యువజన అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘నేనే చాలాసార్లు చెప్పాను. ఈ ఎన్నికలు మనకు కీలకం. రానున్న రోజులకు ఈ ఎన్నికలే పునాది. రాబోయే 25 ఏళ్లలో ఏం జరుగుతుందనేది ముఖ్యం. అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. దీనికి వేరే అర్థం చెప్పాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు
2024 ఎన్నికలే సరైన సమయం - కేసీఆర్
సోమవారం రోజు వీరిద్దరి భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘సామాన్య ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైంది. సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడానికి బదులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలి. కేంద్రంలో అధికారం నుంచి బీజేపీని గద్దె దించేందుకు 2024 ఎన్నికలే సరైన సమయం’’ అని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో గత ఆదివారం (సెప్టెంబరు 13) భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ముందుగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కుమారస్వామి ట్విటర్ ద్వారా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ తో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటితో పాటు జాతీయ రాజకీయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు కుమారస్వామి తెలిపారు. ఆ భేటీ అనంతం కుమారస్వామి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.