Ayodhya Ram Mandir News: అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తి- తయారీకి ఎంతగా శ్రమించారంటే!
Ram Mandir News: గుజరాత్‌లోని ఓ గ్రామం వినూత్నంగా అగరబత్తిని తయారు చేసింది. గుజరాత్ వడోదరలోని తర్సాలీ గ్రామం ఓ భారీ ప్రయత్నం చేశారు.
Long Incense Burner For Lord Rama: అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఊరూ వాడ సంబరాలు చేసుకుంటోంది. రాముడి ఆలయాలు ఉన్న చోట ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయోధ్యలో కొలువు దీరే రాముడి కోసం ఉడతాభక్తిగా ఏదో చేయాలన్న సంకల్పం అందరిలో కనిపిస్తంది. అలా ఆలోచించిన గుజరాత్‌లోని ఓ గ్రామం వినూత్నంగా అగరబత్తిని తయారు చేసింది.
గుజరాత్ వడోదరలోని తర్సాలీ గ్రామం ఓ భారీ ప్రయత్నం చేసి సఫలీకృతమైంది. అయోధ్య రాముడి కోసం బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 108 అడుగుల పొడవు, 3.5 వెడల్పుతో భారీగా దూప్‌స్టిక్‌ను వెలిగించారు.
రెండు నెలల పాటు శ్రమించి ఈ భారీ అగరబత్తిని తయారు చేశారు. దీని కోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పాపౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడను ఈ అగరబత్తి కోసం వినియోగించారు. ఈ భారీ అగరబత్తి తయారు చేయాలన్న ఆలోచన విహాభాయ్ అనే రైతుకు వచ్చింది. తన స్నేహితులు, గ్రామపెద్దలతో మాట్లాడి చివరకు రెండు నెలలు శ్రమించి అగరబత్తిని తయారు చేశారు. దీని బరువు 3400 కిలోలు ఉంది.
గ్రామస్థులంతా అత్యంత జాగ్రత్తగా దీన్ని అయోధ్యకు తరలించారు. మంగళవారం నాడు అక్కడికి చేరుకుందీ అగరబత్తి, దీన్ని శ్రీరామ్ జన్మభఊమి తీర్థ క్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ జీ మహరాజ్ వెలిగించారు. ఇది సుమారు నెలన్నరపాటు వెలుగుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు, స్థానికులు, అగరబత్తి తయారీదారులు హాజరయ్యారు.