Deadbody Forget In Freezer: మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టి మరిచిపోయిన ప్రభుత్వ వైద్యులు - విచారణకు ఆదేశం
ఓ వృద్ధుడి మృతదేహాన్ని మార్చురీ ఫ్రీజర్ లో పెట్టిన వైద్యులు 17 రోజులు అలానే మర్చిపోయిన ఘటన యూపీలో జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఓ మృతదేహాన్ని మార్చురీ ఫ్రీజర్ లో పెట్టిన వైద్యులు అలానే మరిచిపోయిన ఘటన యూపీలో జరిగింది. 17 రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించగా, ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
సంబంధీకులు లేకపోవడంతో
గ్రేటర్ నోయిడాలోని ప్రభుత్వ ఆస్పత్రికి బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన ఓ 70 ఏళ్ల వృద్ధుడిని జులై 22న తీసుకువచ్చారు. అతను చికిత్స పొందుతూ సెప్టెంబర్ 23న ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వృద్ధుడి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే, వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్పించిన వ్యక్తి అప్పటి నుంచి అందుబాటులో లేడు. అతని సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో వైద్యులు కూడా ఈ విషయాన్ని మరిచిపోయారు.
17 రోజుల తర్వాత గుర్తింపు
ఇటీవల మార్చురీలోని ఫ్రీజర్ ను తెరవగా వృద్ధుడి మృతదేహం కనిపించగా వైద్యులు షాకయ్యారు. అది 17 రోజుల క్రితం మృతి చెందిన వృద్ధుడిదిగా గుర్తించారు. ఇలా ఫ్రీజర్ లో మృతదేహాన్ని పెట్టి మరిచిపోవడంపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్పందించిన ఆస్పత్రి వర్గాలు
కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు స్పందించాయి. బాధితుడిని ఆస్పత్రిలో చేర్చిన వ్యక్తి అందుబాటులో లేడని తెలిపారు. మృతుని సంబంధీకుల వివరాలు కూడా తెలియలేదని పేర్కొన్నారు. ఇలా రోగుల సంబంధీకులు లేని కేసులు తరచుగా వస్తున్నాయని, ఇలాంటి సమయాల్లో వారి చికిత్స బాధ్యతలు మొత్తం ఆస్పత్రి వర్గాలే చూసుకుంటున్నాయని ఆస్పత్రి సిబ్బంది పేర్కొన్నారు.