G20 Summit 2023: G-20 సమ్మిట్‌కి జిన్‌పింగ్ కూడా డుమ్మా! కారణమేమై ఉంటుంది?
G20 Summit 2023: జీ20 సదస్సుకి చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ రావడం లేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
G20 Summit 2023:
జీ 20 సదస్సుకి జిన్‌పింగ్ దూరం..
సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G 20 సదస్సు జరగనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ సమ్మిట్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సదస్సుకి 20 దేశాలకు చెందిన అధినేతలతో పాటు అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులూ హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడి జో బైడెన్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కి ఆహ్వానం పంపింది భారత్. వీరిలో జో బైడెన్ తప్ప మిగతా ఇద్దరూ ఈ సదస్సుకి హాజరు కావడం లేదు. "రాలేకపోతున్నాను, దయచేసి ఏమీ అనుకోవద్దు" అంటూ ఇప్పటికే పుతిన్ ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల G20 సమ్మిట్‌కి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు పుతిన్. ఆ తరవాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని Reuters వెల్లడించింది. జిన్‌పింగ్‌కి బదులుగా ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే..దీనిపై భారత్, చైనా విదేశాంగ శాఖల ప్రతినిధులు మాత్రం స్పందించలేదు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాను తప్పకుండా వస్తానని అధికారికంగా ప్రకటించారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. గతేడాది నవంబర్‌లో ఇండోనేసియాలోని బాలిలో జరిగిన G 20 సదస్సుకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు బైడెన్ కూడా హాజరయ్యారు.
Chinese President Xi Jinping likely to skip G20 Summit in India, reports Reuters pic.twitter.com/l2eNZjSnNx
— ANI (@ANI) August 31, 2023
G20 సమావేశానికి పలు కారణాలతో హాజరుకాలేకపోతున్నట్లు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. రష్యా నిర్ణయాన్ని అంగీకరిస్తూ పుతిన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు వెల్లడించారు. G20 కార్యక్రమాలకు రష్యా మద్దతు కావాలని కోరారు. భారత్- రష్యా మధ్య ప్రత్యేకమైన, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం అభివృద్ధి చెందుతోందని క్రెమ్లిన్ అభిప్రాయపడింది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ముగింపులో G20 లీడర్స్ డిక్లరేషన్ని ఆమోదిస్తారు. ఈ జీ20 నేతల సమావేశానికి పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆగస్టు 25న క్రెమ్లిన్ ప్రకటించింది.
ఢిల్లీలో ఆంక్షలు
సెప్టెంబరు 7 రాత్రి నుంచి సెప్టెంబరు 10 వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఆ పరిధిలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన వారు లేదా టూరిస్టులు న్యూఢిల్లీ పరిధిలోకి రావాలంటే హోటల్ బుకింగ్స్ కి సంబంధించిన ప్రూఫ్ చూపించాలని వివరించారు. అంతేకాక, ప్రజలు సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో మార్కెట్లకు, దుకాణాలకు వెళ్లొద్దని సూచించారు. అంతేకాక, న్యూఢిల్లీలోకి వచ్చే కార్గో ట్రక్కులను కూడా నగరం బయటి నుంచే మూడు రోజులపాటు మళ్లించనున్నారు. అత్యవసర వస్తువులను రవాణా చేసే కార్గో ట్రక్కులను మాత్రం అనుమతించనున్నారు.
Also Read: Google AI: ఇకపై హిందీలోనూ వాయిస్ సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్‌లో కొత్త ఫీచర్