UP Female judge: చనిపోతా అనుమతి ఇవ్వండి-సీజేఐకి యూపీ జడ్జి లేఖ
గౌరవంగా చనిపోతా... ప్లీజ్ అనుమతి ఇవ్వండి అంటూ ఒక మహిళా న్యాయమూర్తి సీజేఐకి లేఖ రాసింది. ఒక న్యాయమూర్తికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది..? చనిపోయే అంత బాధ ఏమొచ్చింది..?
UP Female Judge Request To Death: ఆమె ఒక న్యాయమూర్తి. సామాన్యులకు న్యాయం చేయాలని న్యాయవృత్తిలోకి వచ్చింది. కానీ.. ఇప్పుడు ఆమెకే న్యాయం కరువైంది. భరించలేనంత కష్టం వచ్చి పడింది. అది కూడా తన తోటి ఉద్యోగుల లైంగింక వేధింపులు వల్లే. వారి వేధింపులు భరించలేక... చనిపోయేందుకు సిద్ధమైంది ఆ మహిళా న్యాయమూర్తి. ఇక వేధింపులు భరించలేను... గౌరవంగా చనిపోతా.. ప్లీజ్ అనుమతించండి ఇంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది ఆ మహిళా న్యాయమూర్తి. ఆమె రాసిన లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంతకీ ఎవరా న్యాయమూర్తి...?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తోంది ఆ మహిళా న్యాయమూర్తి. జిల్లా జడ్జి, ఆయన అనుచరులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని... రాత్రిపూట ఒంటరిగా జిల్లా జడ్జిని కలవమన్నారని సీజేఐకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా... ప్రయోజనం లేకపోయిందన్నారు బాధితురాలు. తన ఫిర్యాదులో సాక్షులుగా ఉన్నవారు ఆ జిల్లా జడ్జి కింద పనిచేసేవారే కావడంతో... ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారన్న నమ్మకం లేదన్నారు. అందుకే దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆ జడ్జిని మరోచోటుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషను వేశానని... కానీ తన అభ్యర్థనను కొన్ని సెకన్లలోనే కొట్టేశారని చెప్పుకొచ్చారు.
జిల్లా జడ్జి, ఆయన అనుచరుల వేధింపులు మరీ ఎక్కువయ్యాయని.. ఏడాదిన్నరగా తనను ఒక శవంగా మార్చారని.. ఇక తాను బతికుండీ ప్రయోజనం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే... ఇక గౌరవప్రదంగా చనిపోదామని అనుకుంటున్నానని... అందుకు అనుమతి ఇవ్వాలని సీజేఐకి రెండు పేజీల లేఖ రాశారు బాధిత న్యాయమూర్తి. బాధిత న్యాయమూర్తి రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లేఖ విషయం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దృష్టికి రావడంతో... ఆయన వెంటనే స్పందించారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ మధుకర్ కుర్హేకర్‌ను ఆదేశించారు. దీంతో ఆ మహిళా జడ్జి అంతర్గత కమిటీకి చేసిన ఫిర్యాదు, దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ మధుకర్ కుర్హేకర్‌ను ఆదేశాలు జారీ చేశారు.
సామాన్య ప్రజలకు న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఒక న్యాయమూర్తే.. న్యాయం కోసం ప్రతి తలుపూ తట్టాల్సిన పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. తోటి ఉద్యోగుల పెట్టే లైంగిక వేధింపులు తట్టుకోలేక... న్యాయం కోసం ప్రయత్నించినా దొరకక... చివరికి చావే శరణ్యమని అనుకుంది ఆ న్యాయమూర్తి. హుందాగా చనిపోయేందుకు పర్మిషన్ కోరుతూ లేక రాసింది. ఒక మహిళా న్యాయమూర్తి సహోదోద్యులపై ఆరోపణలు చేయడం.. చనిపోతాను అనుమతి ఇవ్వడం అంటూ లేఖరాయడంతో న్యాయవ్యవస్థలో ఒక్కసారిగా కలకలం రేగింది.