Gurugram Covid-19 Scare: కరోనా భయంతో మూడేళ్లుగా చీకట్లోనే ఉంటున్న మహిళ- అద్దె ఇంట్లో ఉంటున్న భర్త
కరోనా ప్రజల్లో ఎంత భయాందోళనలు కలిగించిందో చెప్పేందే స్టోరీ ఇది. గుర్‌గ్రామ్‌లో ఓ ఇంట్లో జరిగిన వెలుగు చూసిన వింత ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
Gurugram Covid-19 Scare: కరోనా పేరు చెబితేనే చాలా మంది వణికిపోతున్నారు. దాన్ని రుజువు చేసే ఘటన ఒకటి గురుగ్రామ్‌లో వెలుగు చూసింది. కరోనా వైరస్ భయంతో ఓ మహిళ మూడేళ్లుగా ఇంట్లోనే తాళం వెసుకొని బిడ్డతో బంధీ అయి ఉంది. పదేళ్ల చిన్నారిని బయటకు పంపించడం లేదు.. తాను కూడా బయటకు రావడం లేదు. ఉద్యోగానికి వెళ్లి వచ్చే భర్తను ఇంట్లోకి రానివ్వడం లేదు. ఇలా మూడేళ్లుగా విచిత్రమైన పరిస్థితిలో ఉందా మహిళ.
మహిళ ప్రవర్తనతో విసిగిపోయిన భర్త... ఇన్నాళ్లకు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు, ఆరోగ్యశాఖాధికారులు వెళ్లి ఆమెకు, చిన్నారిని పరీక్షించారు. గురుగ్రామ్ పోలీస్ స్టేషన్ సెక్టార్-29 పరిధిలోని మారుతి విహార్ సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మూడేళ్లుగా తనను తాను బంధీగా ఉంచుకున్న మహిళ పేరు మున్మున్ మాంఝీగా చెబుతున్నారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆరోగ్య శాఖ అధికారులు, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఇంటి ప్రధాన ద్వారం పగులగొట్టి మున్మున్ మాంఝీతో పాటు అతని పదేళ్ల కుమారుడిని రక్షించారు.
ఈ కేసును ఇలా బయటపడింది
మున్మున్ భర్త సుజన్ మాంఝీ ఫిబ్రవరి 17న చక్కర్పూర్ పోలీస్ ఔట్ పోస్టులో పని చేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుజన్ మాంఝీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్. అతను పనికి వెళ్లాల్సి ఉంది, కాబట్టి మున్మున్ అతన్ని ఇంట్లోకి ప్రవేశించకుండా నిషేధించారు. మొదటి కొన్ని రోజులు స్నేహితులు, బంధువులతో గడిపిన సుజన్ భార్యను ఒప్పించ లేకపోయారు. దీంతో అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీడియో కాల్స్ ద్వారా భార్య, కుమారుడి గురించి తెలుసుకునే వారు.
ముందు పోలీసులు నమ్మలేదు
రెండు ఇళ్ల ఖర్చులను భరిస్తు వచ్చారు సుజన్. భార్యాబిడ్డల కోసం రేషన్ సరకులు, కూరగాయలను ఇంటి బయటే ఉంచేవారు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కుమారుడి ఫీజులు చెల్లించేవాడు. మొదట్లో సుజన్ మాటలను తాను నమ్మలేకపోయానని, అయితే ఆయన తన భార్య, కుమారుడితో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు జోక్యం చేసుకోవాలని నిర్ణయించినట్లు ఏఎస్ ఐ కుమార్ తెలిపారు.
మూడేళ్లుగా సూర్యుడిని చూడలేదు
ఆ మహిళ కుమారుడు గత మూడేళ్లుగా సూర్యుడిని కూడా చూడలేదు. కరోనా భయంతో ఈ మూడేళ్లలో వంటగ్యాస్, ట్యాంక్ నీరును వాడలేదు. ఇద్దరికీ చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే వాళ్లు మళ్లీ నార్మల్ అవుతారని వైద్యులు చెబుతున్నారు.
తల్లీకొడుకులిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. గురుగ్రామ్ సివిల్ సర్జన్ డాక్టర్ వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ... 'మహిళకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. వీరిద్దరినీ రోహ్ తక్ లోని పీజీఐకి తరలించి చికిత్స నిమిత్తం సైకియాట్రిక్ వార్డులో చేర్పించారు.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో ఇలాంటి కేసులు చాలానే వచ్చాయి. కరోనా భయంతో ఇంట్లోనే ఉండిపోయిన వ్యక్తుల స్టోరీలు చాలానే చూశాం. ఇప్పుడు గుర్‌గ్రామ్‌లో అలాంటి కేసు వెలుగు చూసింది.