Fact Check Rahul : రాహుల్ గాంధీ నేపాల్ టూర్ పూర్తి వివరాలు ఇవే ! ఇంతకీ ఆమె ఎవరంటే ?
రాహుల్ గాంధీ నేపాల్‌లో నైట్ క్లబ్‌కు వెళ్లిన వ్యవహారంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అసలు నిజాలు మాత్రం మరుగునపడిపోతున్నాయి. రాహుల్ నేపాల్ పర్యటనపై జరుగుతున్న ప్రచారంలో ఫ్యాక్ట్ చెక్
రాహుల్ గాంధీ నేపాల్ వ్యక్తిగత పర్యటన అక్కడ ఓ నైట్ క్లబ్‌లో ఓ చైనీయురాలితో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు దేశంలో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏది నిజమో..? ఏది అబద్దమో ? ఎవరికీ తెలియనంతగా కథలు..కథలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది నిజం అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత గట్టిగా అరచి చెప్పుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నైట్ క్లబ్ పార్టీపై జరుగుతున్న ప్రచారం.. అందులోని వాస్తవాలపై చేసిన ఫ్యాక్ట్ చెక్ ఇది.
రాహుల్ గాంధీ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటనలకు నేపాల్ వెళ్లారన్నది నిజం. గతంలో సీఎన్‌ఎన్ కరస్పాండెంట్‌గా ఢిల్లీలో పని చేసిన సుమ్నిధా ఉదాస్ రాహుల్ గాంధీకి స్నేహితురాలు. ఆమె ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మాండూకు వెళ్లారు. రాహుల్‌తో పాటు మరికొంత మంది మిత్రులు వెళ్లారు. సుమ్నిధా ఉదాస్ తండ్రి నేపాల్ తరపున దౌత్యవేత్తగా పని చేస్తున్నారు. ప్రస్తుతం మయన్మార్ దౌత్యవేత్త.
సుమ్నిధా ఉదాస్ పెళ్లి నిమా మార్టిన్ షెర్పాతో మూడో తేదీన అంటే మంగళవారం పూర్తయింది. వివాహానికి వెళ్ళిన రాహుల్ , ఆయన మిత్రులు ఖాట్మండులోని మేరియట్ హోటల్లో బస చేశారు . ఆ హోటల్‌లో ఉన్న పబ్ పేరు లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్. పబ్ వర్గాలు మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం రాహుల్‌తో పాటు మరో నలుగురైదుగురు స్నేహితులు ఉన్నారు. వారిలో చైనా దౌత్యవేత్తలు ఎవరూ లేరు. దాదాపుగా గంటన్నర సేపు వారు అక్కడిఉండి మళ్లీ హోటల్ గదికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో రాహుల్ తో పాటు ఉన్న యువతి కూడా పెళ్లి కూతురి స్నేహితురాలు . ఆమె చైనా దౌత్యవేత్త కాదు . ఖాట్మండులోని అనిల్ గిరి అనే సీనియర్ జర్నలిస్టు సమాచారం ప్రకారం ఆ యువతి ఒక నేపాలీ మహిళ , పెళ్లి కూతురి స్నేహితురాలు . కానీ ఆమెను నేపాల్‌లోని చైనా దౌత్యవేత్త యో హంకీ గా చాలా మంది ప్రచారం చేశారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేపాల్‌లోని చైనా దౌత్యవేత్తపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆమెను చైనా దౌత్యవేత్తగా ఇండియాలోని కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చైనా హనీ ట్రాప్ లాంటి పదాలను కూడా వాడారు. అయితే నిజం చెప్పులేసుకునేలోపు అబద్దం ప్రపంచం మొత్తం తిరిగి వస్తుందన్నట్లుగా రాహుల్ గాంధీ నైట్ క్లబ్‌పై అవాస్తవ ప్రచారాలు మాత్రం విస్తృతంగా జరుగుతున్నాయి.