Election Results 2023: కొద్ది తేడాతోనే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి! ఓటు శాతంపై ఆ పార్టీ అనాలసిస్
Election Results 2023: మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని జైరాం రమేశ్ వెల్లడించారు.
5 States Election Results 2023:
ఓటు శాతం..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓటమి చవి చూసింది (Election Results 2023 Updates) కాంగ్రెస్. తెలంగాణలో గెలవడం కాస్త ఊరటనిచ్చినా చేతిలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ని మాత్రం కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ కీలక ట్వీట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓటు షేర్ తేడా తక్కువగానే ఉందని లెక్కలతో సహా పోస్ట్ చేశారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాబట్టుకోలేకపోయిందని అంగీకరించారు. అయితే...ఓటు షేర్ విషయంలో మాత్రం కాంగ్రెస్ పుంజుకుందని త్వరలోనే పార్టీ యాక్టివ్ అవ్వడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
"ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో రాణించలేదన్న మాట వాస్తవమే. మా అంచనాలు అందుకోలేకపోయాం. కానీ ఓటు షేర్ లెక్కలు ఓసారి చూస్తే కాంగ్రెస్ మరీ వెనకబడిపోలేదని అర్థమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. మేం మళ్లీ పుంజుకుంటాం అని విశ్వసించడానికి ఇదే కారణం"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ
It is true that the performance of the Indian National Congress in Chhattisgarh, Madhya Pradesh and Rajasthan was disappointing and far below our own expectations. But the vote shares tell a story of a Congress that is not very behind the BJP—in fact, it is within striking…
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 4, 2023
లెక్కలు ఇలా ఉన్నాయి..
ఇదే పోస్ట్‌లో మూడు రాష్ట్రాల ఓటు షేర్ లెక్కల్ని ప్రస్తావించారు జైరాం రమేశ్. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓటు శాతం 46.3% కాగా కాంగ్రెస్‌ది 42.2%. మధ్యప్రదేశ్‌లో BJP ఓటు షేర్ 48.6% కాగా కాంగ్రెస్‌కి 40.4% ఓట్ల పోల్ అయ్యాయి. రాజస్థాన్‌లో బీజేపీకి 41.7% ఓట్లు పోల్ అవ్వగా..కాంగ్రెస్‌కి 39.5% ఓట్లు దక్కాయి. ఈ లెక్కల్నే ఉదాహరణగా చూపిస్తూ కాంగ్రెస్ మళ్లీ రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశారు జైరాం రమేశ్. "జుడేగా భారత్, జీతేగా ఇండియా" అంటూ చివర్లో ఓ ట్యాగ్ లైన్ పెట్టారు. విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమి నినాదమిదే. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల ఘన విజయం సాధించింది బీజేపీ. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టిపోటీ ఉంటుందని అంచనా వేసినప్పటికీ అదేమీ కనిపించలేదు. పూర్తిగా బీజేపీవైపే మొగ్గారు ఓటర్లు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. కాంగ్రెస్ కూడా ఈ ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని ధీమాగా ఉంది. కానీ చివరికి వచ్చే సరికి సీన్ మారిపోయింది. ఇక్కడా బీజేపీకే పట్టంకట్టారు ఓటర్లు.