Delhi CM కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు, అరెస్ట్ చేస్తారేమోనని ఆప్ మంత్రుల ఆందోళన!
Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. కేజ్రీవాల్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
ED Raids at Arvind Kejriwal Home: న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ జరిగిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో ఇదివరకే ఢిల్లీ మంత్రులను ఈడీ అరెస్ట్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సైతం అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తోంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసు సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఉచ్చు బిగుసుకుంటోంది. కేజ్రీవాల్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే వాతావరణం కనిపిస్తోంది.
కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ 9 సార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ప్రతిసారి విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై గుర్రుగా ఉన్న ఈడీ అధికారులు 8 మంది సెర్చ్ వారెంట్ తో ఆయన ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ కు 10వ సారి ఈడీ అధికారులు సమన్లు జారీ చేస్తున్నారు. నేటి రాత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ అవకాశం ఉందని ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మంత్రులు, ఆప్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు.
కేజ్రీవాల్‌కి హైకోర్టు షాక్
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు గురువారం తోసిపుచ్చింది. ఈడీ అరెస్ట్ నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. అయితే..ఈ పిటిషన్‌పై స్పందించాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 22వ తేదీన మరోసారి విచారణ జరుపుతామని వెల్లడించింది. కానీ అంతలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని సోదా చేస్తున్నారు.