Delhi Yamuna Flood: 45 ఏళ్ల తర్వాత ఢిల్లీలో 208 మీటర్లు దాటిన యమునా నీటిమట్టం
Delhi Yamuna Flood: ఢిల్లీలో యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలో పెరిగింది. నది పరిసర ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది.
Delhi Yamuna Flood:
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరద పోటుకు యమునా ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. 45 ఏళ్ల తర్వాత నది నీటిమట్టం 208.30 మీటర్లు దాటింది. వరద పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) పోర్టల్ ప్రకారం పాత రైల్వే వంతెన వద్ద నీటిమట్టం ఉదయం మొదటిసారి 207 మీటర్ల మార్కును దాటింది. సాయంత్రం రికార్డు స్థాయిలో 208 మీటర్లకు చేరింది. రాత్రి 8 గంటలకు 208.30 మీటర్లకు పైగా పెరిగింది.
పాత రైల్వే బ్రిడ్జిపై పెరిగిన నీటిమట్టం
పాత రైల్వే బ్రిడ్జిపై రాత్రి 10 గంటలకు అత్యధిక నీటి మట్టంతో కొత్త రికార్డు నమోదైందని ప్రభుత్వం తెలిపింది. 1978లో యమునా నది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరింది. బుధవారం రాత్రి 9 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం 207.95 మీటర్లుగా నమోదైంది. అంతకు ముందు రాత్రి 8 గంటలకు హత్తినికుండ్ బ్యారేజీ నుంచి 1,47,857 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
యమునా నది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో నది వెంబడి పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు
బోట్ క్లబ్‌కు చెందిన 17 బోట్లు, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ కు చెందిన 28 బోట్లను సహాయక చర్యల కోసం విధుల్లో ఉంచినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 45 బోట్లను దించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన 12 బృందాలను రంగంలోకి దిగాయి.
లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలను గురువారం (జూలై 13) మూసివేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) విద్యాశాఖ నిర్ణయించింది.
ఢిల్లీలో వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సివిల్ లైన్స్ జోన్ లోని లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలు, షహదారా సౌత్ జోన్ లోని ఆరు పాఠశాలలు, షహదారా నార్త్ జోన్ లోని ఒక పాఠశాలను మూసివేయాలని ఎంసీడీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.
సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
ఢిల్లీలో యమునా నది పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరడంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద పరిస్థితుల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ పోలీసులు బుధవారం దేశ రాజధానిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ సెక్షన్ ప్రకారం ఒకే చోట నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.
నది నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఢిల్లీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ అధికారి ఒకరు తెలిపారు. నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకోవడంతో యమునా నది నీటిమట్టం మరింత పెరగకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
వీలైతే హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ నుంచి పరిమిత వేగంతో నీటిని విడుదల చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కేజ్రీవాల్ కోరారు. దేశ రాజధానిలో వరదలు అనే అంశం ప్రపంచానికి మంచి సందేశాన్ని ఇవ్వదన్నారు. ఈ పరిస్థితి నుంచి అందరం కలిసి ఢిల్లీ ప్రజలను కాపాడాలి అని రిక్వస్ట్ చేశారు.
ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
యమునా నదిలో నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. అకస్మాత్తుగా నీటిమట్టం పెరిగి మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలంతా ఖాళీ చేయాలని కోరారు.
యమునా నది నీటిమట్టం పెరగడంతో ఐటీవో సమీపంలో ఉన్న ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం జలమయమైంది. అదే సమయంలో ఉద్యోగులు కార్యాలయానికి రావాలంటే నీటిలోనే రావాల్సి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం నది కరకట్టలను బలోపేతం చేస్తోందని, వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తోందని రెవెన్యూ మంత్రి అతిషి చెప్పారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది.
యమునా నదిలో వరద పరిస్థితి కారణంగా ప్రజలు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 1077ను సంప్రదించాలని అథారిటీ జారీ చేసిన సలహాలో పేర్కొంది.
పాత రైల్వే బ్రిడ్జి మూసివేత
యమునా నది నీటి మట్టం సోమవారం రాత్రి 206 మీటర్ల మార్కును దాటింది, వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రోడ్డు అండ్ రైలు రాకపోకల కోసం పాత రైల్వే వంతెనను మూసివేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాకు తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యమునా నది నీటిమట్టం ఎందుకు పెరుగుతోంది?
ఢిల్లీలో యమునా నది నీటిమట్టం అనూహ్యంగా పెరగడానికి పూడిక పేరుకుపోవడం, నదీ గర్భం పెరగడమే కారణమని దక్షిణాసియా నెట్ వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్, పీపుల్ (ఎస్ఏఎన్ఆర్పీ) అసిస్టెంట్ కోఆర్డినేటర్ భీమ్ సింగ్ రావత్ తెలిపారు. వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు 22 కిలోమీటర్ల పొడవునా పూడికతీత, 20కి పైగా వంతెనలు, మూడు బ్యారేజీలు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదిలో నీటిమట్టం పెరిగింది. వాయవ్య భారతంలో వారాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.