Water Crisis in Delhi: నీటి సంక్షోభంలో దిల్లీ, నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానంటూ ప్రధాని మోదీకి ఆప్ మంత్రి లేఖ
Water Crisis in Delhi: దిల్లీని తీవ్రమైన నీటి కొరత వేధిస్తోంది. నీటి ట్యాంకర్ల వద్ద క్యూలో గంటల కొద్దీ జనం నీటి కోెసం బారులు తీరుతున్నారు. దీనిపై ఆప్ మంత్రి అతీషీ నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.
Severe Water Crisis in Delhi: దేశ రాజధాని దిల్లీలో నీటి సంక్షోభంపై ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి అతీషి యుద్ధం ప్రకటించారు. దిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించే వరకు తాను నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని బుధవారం ఆమె స్పష్టం చేశారు. దిల్లీకి నీటిని విడుదల చేయడంలో హర్యానా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే దేశ రాజధానిలో నీటి సంక్షోభం తలెత్తిందని ఇక్కడి ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒకవైపు భానుడి ప్రతాపం, మరోవైపు నీటి సంక్షోభం దిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి. నీటి కొరతతో నగర వాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని దిల్లీ ప్రభుత్వం కోరింది.
నీటిని వదిలేందుకు హర్యానా ఒప్పుకోవట్లేదు
ఢిల్లీ మంత్రి అతీషి మాట్లాడుతూ.. ‘‘దిల్లీకి సరిపడా నీటిని విడుదల చేయాలని నేను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాను. వారు నా అభ్యర్థనను అంగీకరించారు. కనీసం ఆ నీరు డిల్లీకి చేరాలన్నా.. హర్యానా నుంచే రావాలి. ఆ నీటిని వదిలేందుకు కూడా హర్యానా ఒప్పుకోవట్లేదు. దిల్లీ ఇప్పటికే దారుణమైన ఎండ తాకిడికి గురవుతోంది. ప్రజలు వేడికి బెంబేతెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ ప్రజలకు నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. దిల్లీకి ఉన్న మొత్తం నీటి సరఫరా 1050 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్ డే) కాగా.. 613 ఎంజీడీ హర్యానా నుంచే వస్తుంది. మంగళవారం హర్యానా 513 ఎంజీడీల నీటిని మాత్రమే దిల్లీకి వదిలింది. దీంతో 100 ఎంజీడీ తక్కువ నీటి సరఫరా జరిగింది. ఒక ఎంజీడీ నీరు.. 28,500 మంది అవసరాలకు వినియోగించవచ్చు. అంటే ఈ వంద ఏంజీడీ నీటి కొరత వల్ల 28 లక్షల మందికి పైగా నీరు లేక నరకం చూస్తారు. వారందరిపై ఈ ఈ నీటి కొరత ప్రభావం పడుతుంది’’ అని అతీషి చెప్పారు.
నీటి సంక్షోభాన్ని రెండు రోజులలో పరిష్కరించాలని తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు అతీషీ వెల్లడించారు. ‘‘నేను మోదీకి లేఖ రాశాను. దిల్లీ ప్రజలకు త్వరితగతిని నీటిని సమకూర్చాలని ఆయన్ని అభ్యర్థించాను. దిల్లీ ప్రజలకు జూన్ 21 కల్లా సరిపడినంత నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే నేను సత్యాగ్రహాన్ని మొదలుపెడతానని తెలిపాను. నీటి సమస్య తీరే వరకు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటా’’ అని స్పష్టం చేశారు.
నీటి సంక్షోభంపై ఉద్యమాలు
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు దిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సంక్షోభంపై ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నాయి. దిల్లీ ప్రభుత్వం సైతం దిల్లీవాసుల నీటి అవసరాలు తీర్చేందకు నీటి ట్యాంకుల ద్వారా నిత్యం విశ్వ ప్రయత్నం చేస్తుంది. దిల్లీలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు వాటర్ ట్యాంకర్ల వద్ద క్యూ కట్టడం కనిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈసారి భానుడి ప్రచండ ప్రతాపంతో నీటి అవసరాలు భారీగా పెరగడమే ప్రస్తుత నీటి కొరతకు కారణంగా చెబుతున్నారు. దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవువుతన్నాయి. దీంతో పాటు యమునా నది ప్రవాహం తగ్గడం దిల్లీ నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యని కొంతైనా తగ్గించేందకు, నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు అధికారిక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.