Delhi CM రేఖా గుప్తాపై ఆమె నివాసంలోనే దాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Attack on Rekha Guptha | ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమె నివాసంలోనే దాడి జరిగింది.. సివిల్ లైన్స్ లోని ప్రభుత్వ నివాసంలో జన విచారణ సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా రేఖా గుప్తపై దాడి చేశాడు.

Delhi CM Rekha Guptha Attack | న్యూడిల్లీ: ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) ఉదయం ఆమె నివాసంలో దాడి జరగడం కలకలం రేపుతోంది. తన నివాసంలో ప్రజా విచారణ కార్యక్రమం చేపట్టిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తపై దాడి జరిగింది. ఫిర్యాదుదారుడిగా సమావేశానికి వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా మహిళా సీఎంపై దాడికి పాల్పడ్డాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రేఖా గుప్తాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడికి యత్నించిన నిందితుడ్ని పోలీసులు విచారిస్తున్నారు. దాడి చేయడానికి కారణాలపై ప్రశ్నిస్తున్నారు.
దాడి ఎలా జరిగింది?
సమాచారం ప్రకారం, నిందితుడు దాదాపు 30 ఏళ్ల యువకుడు జన విచారణ కార్యక్రమం సమయంలో కొన్ని పత్రాలను తీసుకువచ్చాడు. కాగితాలు చూపిస్తానని సీఎం రేఖా గుప్తతో మాట్లాడటం ప్రారంభించిన వ్యక్తి ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాడు. నిందితుడు రేఖా గుప్తాను కొట్టాడని, ఆమె జుట్టును లాగాడని సమాచారం.
రాజకీయాల్లో హింసకు తావు లేదు - వీరేంద్ర సచ్‌దేవా
సీఎం రేఖా గుప్తాపై దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. "వారం రోజుల జన విచారణ సమయంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని అన్నారు. వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. "ఒక మహిళపై, ముఖ్యంగా రోజుకు 18 గంటలు పనిచేసే మహిళపై ఎలా దాడి చేస్తారు అని ఆశ్చర్యం వేస్తుంది. రాజకీయాల్లో హింసకు తావు లేదు" అని అన్నారు. ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. మహిళా సీఎం రేఖా గుప్తా చేస్తున్న క్షేత్రస్థాయి పనులతో ప్రతిపక్షాలు కలవరపడుతున్నాయని, అందుకే ఈ దాడి ఘటన నిదర్శనం అన్నారు.
దాడిని ఖండించిన మాజీ సీఎం అతిషి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకురాలు, మాజీ సీఎం ఆతిషి కూడా రేఖా గుప్తాపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు, నిరసనలకు చోటుంది. కానీ హింసకు తావు లేదు అని ఆమె అన్నారు. పోలీసులు దోషులను కఠినంగా శిక్షిస్తారని, ముఖ్యమంత్రి రేఖా గుప్తా త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించారు.
ఢిల్లీ పోలీసులు సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను సీఎం నివాసంలో భారీ భద్రతా లోపంగా పరిగణిస్తున్నారు. పోలీస్ కమిషనర్ ఎస్‌బీకే సింగ్ స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారు. ప్రతి వారం ముఖ్యమంత్రి నివాసంలో 'జన విచారణ' నిర్వహిస్తున్నారు. కనుక ఈ సంఘటన ముఖ్యమంత్రికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. దాడికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా.. లేక రాజకీయ కారణాలతో దాడి జరిగిందా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అని అన్ని కోణాల్లో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






















