Rajnath Singh : పాకిస్తాన్‌తో చర్చలకు సిద్ధం- బట్ కండిషన్స్ అప్లై అంటున్న రాజ్‌నాథ్ సింగ్
Jammu & Kashmir Elections 2024: టెర్రరిజంకి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపేస్తేనే భారత్ చర్చలకు సిద్ధమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు.
Rajnath Singh made a statement on Pakistan: టెర్రరిజంకి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపేస్తేనే భారత్ చర్చలకు సిద్ధమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. జమ్ము- కశ్మీర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజ్‌నాథ్.. పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని.. ఐతే పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటేనే అవి సాధ్యం అవుతాయని అన్నారు. సోమవారం బనిహాల్ సభలో భాజపా అభ్యర్థి మొహమద్ సలీమ్ భట్ తరపున ప్రచారం నిర్వహించిన రాజ్‌నాథ్.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా నరేంద్రమోదీ సర్కారు జమ్ము కశ్మీర్ సంపద విస్తరణకు దోహదం చేసిందని వివరించారు. కశ్మీర్ లోయలో పాక్ అరాచకాలకు చాలా వరకు సక్సెస్ ఫుల్‌గా అడ్డుకట్ట వేయగలిగామన్నారు. దాయాది దేశం సరిహద్దు దేశాలతో సంబంధాలను పెంచుకోవడం కంటే ఆ దేశాల్లో విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. స్నేహితులను మార్చుకోగలం కానీ ఇరుగు పొరుగు వారు ఎప్పటికీ మారరన్న విషయాన్ని ఇస్లామాబాద్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
జమ్ము కశ్మీర్‌లో టెర్రరిజానికి బలవుతోందీ ముస్లీంలే: రాజ్‌నాథ్
పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు బలితీసుకుంటోంది ముస్లీంలనేనని రాజ్‌నాథ్ అన్నారు. జమ్ము కశ్మీర్‌లో జరిగే టెర్రర్ ఎటాక్స్‌లో హిందువులతో పోల్చితే మస్లీంలనే ఎక్కువ మందిని పాక్ పొట్టన పెట్టుకుంటోందని చెప్పారు. టెర్రర్ మరణాల్లో 80శాతం ముస్లీం కుటుంబాల నుంచే ఉన్నాయన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలు కూడా భారత్‌లో కలవాలని సూచించారు. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్‌లోని ప్రజలను ఆ దేశ ప్రభుత్వం ఎప్పుడూ ఫారినర్స్‌గానే చూస్తోందని.. భారత్ మాత్రం వారిని ఇండియన్స్‌గా పరిగణిస్తుందని తెలిపారు. ఇటు జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ సంపద పెరిగిందన్నారు. ఈ ఆర్టికల్‌ను 2019లో నరేంద్రమోదీ సర్కారు రద్దు చేయగా అప్పటి నుంచి భారత్- పాక్ మధ్య సంబంధాల్లో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని.. రాళ్ల దాడులు తగ్గాయని కేంద్రం పేర్కొంది.
జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు
జమ్ముకశ్మీర్‌లో తొలి దశ సెప్టెంబర్ 18న రెండో దశ 25న మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి. జమ్ము కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జమ్ము కశ్మీర్ ఎన్నికల వేళ కొన్ని వారాలుగా కశ్మీర్‌లోయలో ఉగ్రకార్యకలాపాలు పెరిగాయి.
జూన్‌లో పూంఛ్ సెక్టార్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారి చనిపోయాడు. ఈ దాడిని భద్రతాబలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. జులైలో కుప్వారాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుపెట్టాయి. అదే నెలలో దోడాలో పాక్ నుంచి ఆపరేట్ చేస్తున్న ఉగ్రసంస్థ జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మరణించారు. కథువాలో ఆర్మీ కాన్వాయ్‌పై జరిగిన మరో దాడిలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టు నెలలోనూ ఉగ్రదాడులు జరిగాయి. 2023 జూన్‌లోనూ రైసీ ఆధ్యాత్మిక యాత్రపై ఉగ్రదాడికి తెగపడి 9 మంది భక్తులను పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో భారత్‌తో శాంతి చర్చలు జరగాలంటే ముందుగా పాకిస్తాన్ ఈ నేలపై నెత్తురు పారించడం ఆపాలని పదేపదే కేంద్రం స్పష్టం చేస్తూ వస్తోంది.