బీజేపీ ఓటు బ్యాంక్‌కి గురి పెట్టిన కాంగ్రెస్, రిజర్వేషన్ అస్త్రాలతో యుద్ధానికి రెడీ
CWC Meeting: ఓబీసీ రిజర్వేషన్ అస్త్రంతో బీజేపీపై యుద్ధానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
CWC Meeting:
ఓబీసీ రిజర్వేషన్‌ల అస్త్రం..
బీజేపీ విజయ రథం వేగంగా ముందుకెళ్తోంది. అడ్డం ఎవరు వచ్చినా తొక్కుకుంటూ పోతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగరేస్తోంది. ఇప్పట్లో బీజేపీ దూకుడుని ఆపడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంత జోరుతో ఉన్న కాషాయ పార్టీకి బ్రేక్‌లు వేయాలని తెగ ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. ఈ వేదికగా కొత్త అస్త్రాలు తయారు చేసుకుంది. ఇవి ఎంత వరకూ సక్సెస్ అవుతుందో లేదో అన్న క్లారిటీ లేకపోయినా మోదీ సర్కార్‌పై యుద్ధం చేయడానికి ఇంత కన్నా మంచి ఆయుధాలు లేదని భావిస్తోంది హైకమాండ్. ఆ అస్త్రాలే "కుల గణన" (Caste Census), దళితులు ఆదివాసీలు, OBC రిజర్వేషన్‌లు పెంచడం. ఈ రెండు డిమాండ్‌లతో ముందుకెళ్లాలని ప్లాన్ చేసుకుంది కాంగ్రెస్. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, OBC రిజర్వేషన్‌లు పెంచాలన్న డిమాండ్‌లు వినిపించాలని CWC తీర్మానం కూడా చేసుకుంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా క్లారిటీ ఇచ్చారు. కుల గణన కర్ణాటక నుంచే మొదలు పెట్టాలన్న డిమాండ్‌ని రాహుల్ గాంధీ వినిపించారని చెప్పారు. కర్ణాటకలోని కొలార్ నియోజకవర్గంలో కుల గణన చేపడితే అన్ని కులాల వారికీ రిజర్వేషన్‌ల పరంగా న్యాయం జరుగుతుందని రాహుల్ చెప్పినట్టు సమాచారం.
అలా గురి పెడతారా..?
ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే రాష్ట్రాల్లో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుతున్నారు. నిజానికి దళితులు, ఆదివాసీలు కాంగ్రెస్‌కి ఎప్పటి నుంచో ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఆ ఓట్లను కాపాడుకునేందుకు ఇలా రిజర్వేషన్‌ల డిమాండ్‌ని తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్. కాంగ్రెస్ అధ్యక్షుడి రేస్‌లో మల్లికార్జున్ ఖర్గేని నిలబెట్టి ఆయనకే ఆ పదవి కట్టబెట్టింది హైకమాండ్. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. అలాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పజెప్పి ఆ వర్గానికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఇప్పుడు రిజర్వేషన్‌ల అస్త్రాన్నీ ప్రయోగించనుంది. అయితే..రిజర్వేషన్ పరిమితుల్ని పెంచాలన్న డిమాండ్ పైకి కనిపిస్తున్నా...పరోక్షంగా OBC ఓటు బ్యాంక్‌కి గురి పెడుతోంది హస్తం పార్టీ. బీజేపీకి OBC ఓటు బ్యాంకు ఎక్కువ. ఒకవేళ ఈ రిజర్వేషన్ పెంపు డిమాండ్‌కి OBC నుంచి మద్దతు వస్తే బీజేపీని ఓడించడానికి అంతకి మించిన అవకాశం ఇంకేమీ ఉండదన్నది కాంగ్రెస్ ఆలోచన. ఎలాగో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంలాంటి సమస్యల్ని ప్రస్తావిస్తోంది. వీటికి తోడు రిజర్వేషన్‌ల అంశమూ తోడైతే మరింత బలం వస్తుంది. ఇక మహిళా రిజర్వేషన్ బిల్‌కీ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది కాంగ్రెస్. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్ తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఆ విధంగా మహిళల ఓట్లనూ రాబట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఈ సారి రిజర్వేషన్ అంశాన్నే పూర్తిగా నమ్ముకుని ముందుకెళ్లనుంది కాంగ్రెస్.
Also Read: Third Front Alliance: కేసీఆర్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్? అసదుద్దీన్ ఒవైసీ హింట్ ఇచ్చారా?