AI Clinic In India: దేశంలోనే తొలి ఏఐ క్లినిక్.. డాక్టర్లకు బదులుగా AI సాయంతో చికిత్స అందిస్తారా?
AI clinic ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. దేశంలోని పేషెంట్లకు ప్రత్యేక చికిత్స పరిష్కారాలను సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తుంది

భారతదేశంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, టెక్నాలజీని వినియోగించడంలో గ్రేటర్ నోయిడాలో కీలక మార్పు ప్రారంభమైంది. ఇక్కడి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్లినిక్ ప్రారంభించారు. ఈ AI క్లినిక్ చికిత్స పద్ధతిని మరింత ఖచ్చితంగా మార్చడమే కాకుండా, పేషెంట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చికిత్స పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
ఇప్పటివరకు భారతదేశంలో చికిత్స కోసం ఉపయోగించే పరిశోధనలు, సాంకేతికతలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల డేటాపై ఆధారపడి ఉన్నాయి. ఎందుకంటే అక్కడి ప్రజల జీవనశైలి, ఆహారం, జన్యు నిర్మాణం, వ్యాధుల నమూనాలు భారత ప్రజల కంటే భిన్నంగా ఉంటాయి. అందువల్ల చాలాసార్లు చికిత్స అంత ప్రభావవంతంగా కనిపించదు. ఈ లోపాన్ని తొలగించే లక్ష్యంతో GIMSలో ఈ AI క్లినిక్ ప్రారంభించినట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
AI క్లినిక్ అంటే ఏమిటి.. ఇది ఎందుకు ప్రత్యేకమైనది?
AI క్లినిక్.. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీని ఆరోగ్య సంరక్షణ సేవలతో అనుసంధానం చేస్తారు. ఈ క్లినిక్‌లో ఆసుపత్రుల రియల్ టైం డేటా స్టార్టప్‌లు, పరిశోధకులకు అందుబాటులో ఉంచుతారు. తద్వారా వారు ఆ డేటా ఆధారంగా కొత్త టెక్నాలజీ, మెరుగైన చికిత్స పద్ధతులను అభివృద్ధి చేయగలరు.
ఈ డేటాలో రోగుల వ్యాధి నమూనాలు, జన్యు చరిత్ర, చికిత్సకు ప్రతిస్పందన, మెడికల్ ఇమేజింగ్ నివేదికలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ సమాచారాన్ని అధ్యయనం చేయడం ద్వారా AI వ్యవస్థ పేషెంట్లలో ఒక నిర్దిష్ట వ్యాధికి చికిత్స ఎలా మరింత ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోగలదు.
వైద్యుల స్థానాన్ని టెక్నాలజీ భర్తీ చేస్తుందా?
AI క్లినిక్ ముఖ్య ఉద్దేశ్యం వైద్యుల స్థానాన్ని భర్తీ చేయడం కాదు. వారికి సహాయం చేయడం, వేగంగా వ్యాధి లక్షణాలను గుర్తించడం. AI సాంకేతికత వైద్యులకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మెడికల్ రిపోర్టులను త్వరగా, సరిగ్గా అర్థం చేసుకోవడంతో పాటు వ్యాధులను ముందుగానే గుర్తించడం, సరైన చికిత్సను సూచించడం, క్లినికల్ వర్క్‌ఫ్లోను సులభతరం చేయడం వంటివి ఏఐ చేస్తుంది. వైద్యుల పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలోనే AI ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చేస్తారు. వాటిని మొదట పరీక్షించి తరువాత ప్రభుత్వ ఆమోదంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో అమలు చేస్తారు.
స్టార్టప్స్, యువతకు గొప్ప అవకాశం
ఈ AI క్లినిక్ నుండి హెల్త్ టెక్ స్టార్టప్‌లు ప్రయోజనం పొందుతాయి. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల డేటా స్టార్టప్‌లకు సులభంగా అందుబాటులో ఉండేది కాదు. కానీ ఈ నిర్ణయాలతో AIIMS, GIMS వంటి సంస్థలు డేటాను షేర్ చేసుకుంటాయి.
గ్రేటర్ నోయిడాలోని GIMS ఇన్‌క్యుబేషన్ సెంటర్ ద్వారా స్టార్టప్‌లకు సాంకేతిక సహాయం, నిపుణుల గైడెన్స్, పరీక్షా సౌకర్యం అందించనున్నారు. IIT, NIT, ప్రైవేట్ కళాశాలలు కూడా ఈ క్లినిక్‌తో కలిసి తమ సాంకేతిక నైపుణ్యం ద్వారా ముందుకు సాగుతాయి. రోగుల డేటా భద్రత, గోప్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక పర్యవేక్షణ కమిటీ, AI నిపుణుల బృందం అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తుంది. ఆచరణాత్మకమైన, సురక్షితమైన, రోగుల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఆవిష్కరణలు మాత్రమే ముందుకు కొనసాగుతాయి.
ఎప్పుడు ఫిజికల్ లాంచ్ అవుతుంది?
GIMS డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ రాకేష్ గుప్తా దీనిపై స్పందించారు. AI క్లినిక్ అనేది అవసరం. తద్వారా కొత్త సాంకేతికతలు నేరుగా రోగులు, వైద్యులకు వేగంగా చేరుతాయి. ఈ క్లినిక్ ఫిజికల్ లాంచ్ జనవరి 6న చేస్తున్నాం. అంతకు ముందు దీనిని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డాక్టర్ సుజాతా చౌదరి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.






















