డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద గతంలో నమోదైన కేసులో జలాలాబాద్ పోలీసులు, ఉదయం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలను ఎమ్మెల్యే ఖైరా ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే ఖైరాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించి వారెంట్ చూపించాలని పోలీసులకు వాగ్వాదానికి దిగాడు. ఎమ్మెల్యే అరెస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాత ఎన్‌డీపీఎస్ కేసులో ఖైరాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, భోలాత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నాడు.
గతంలో అకాలీదళ్ కీలక నేత బిక్రమ్ సింగ్ మజిథియాపై పంజాబ్ పోలీసులు కేసును నమోదు చేశారు. మాజీ కేంద్ర మంత్రి అయిన హర్ సిమ్రాత్ కౌర్ బాదల్‌కు మజిథియా సోదరుడు. 2018లో డ్రగ్స్ మాఫియాతో అక్రమ రవాణాలో సహకారం, నేరపూరిత కుట్రలపై మజిథియాపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా డ్రగ్స్ విక్రయాలు జరిగేది పంజాబ్ లోనే. అఖిల భారత వైద్య విజ్నాన సంస్థ అంచనాల ప్రకారం పంజాబ్ లో ఏటా సుమారు రూ.7500 కోట్ల విలువైన డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. అందులో హెరాయిన్ వాటా రూ.6,500 కోట్ల వరకు ఉంటుంది. రైతులు మొదలు చిరు వ్యాపారులు, బడా వ్యాపార వేత్తల వరకు ప్రతి ఒక్కరూ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఆర్మీలోనూ కొందరు సైనిక జవాన్లు సైతం డ్రగ్స్‌కు బానిసలుగా మారి బలహీనులు అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
పంజాబ్ జనాభా 2.77 కోట్ల మంది అయితే మత్తు పదార్ధాలకు బానిసలైన వారు రెండు లక్షల మందికి పైమాటే. అంటే 0.84 శాతం పంజాబీలు మత్తు పదార్థాలకు బానిసలైనట్లు ఎన్‌డిడిటిసి అధ్యయనంలో తేల్చింది. డ్రగ్స్ బారిన పడుతున్న వారిలో అత్యధికులు 18 - 35 ఏళ్ల మధ్య వయస్కులే. వీరిలో 80% మంది బాధితులు డ్రగ్స్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.. 35 శాతం మంది మాత్రమే ఉపశమనం పొందారని గణాంకాలు చెప్తున్నాయి. డ్రగ్స్ బాధితుల పునరావాసం కోసం రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు సహాయ కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.
సగటున ప్రతిరోజూ రూ.20 కోట్ల మేరకు పంజాబ్ లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోంది. ఒక్కో వ్యక్తి డ్రగ్స్ కోసం సుమారు రూ.1400 ఖర్చుచేస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. దాదాపు 1.23 లక్షల మందికి పైగా పంజాబీలు హెరాయిన్ వాడుతున్నారని నివేదికలో వెల్లడైంది. మరి కొంత మంది ఓపియం ఇతర పదార్థాలు వినియోగిస్తున్నారు. మరో 75 వేల మంది డ్రగ్స్ ఇంజక్షన్ల రూపంలో సుకుంటున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల నరాలు దెబ్బతినడంతోపాటు యువత శక్తి సామర్థ్యాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తుందని అంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ మీదుగా దశాబ్దాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. సమస్య తీవ్రతరం కావడంతో ప్రధాన పార్టీలన్నీ 'డ్రగ్స్ రహిత పంజాబ్' నినాదాన్ని తలకెత్తుకున్నాయి.