(Source: ECI/ABP News/ABP Majha)
Ban On Onion Exports : దేశంలో ఉల్లి ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధం- వదంతులపై స్పందించిన కేంద్రం
Onion Exports : దేశంలో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. మార్చి 31 వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.
Onion Exports Ban: దేశంలో ఉల్లి నిల్వలు ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని విధించింది. అయితే గడిచిన కొద్ది రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారంపై కేంద్రం తాజాగా స్పందించింది. గతంలో ప్రకటించినట్లుగానే ఈ ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం అమల్లో ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
2023 డిసెంబర్ ఎనిమిదో తేదీన కేంద్రం ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం ఎత్తి వేయలేదని, కొనసాగుతుందని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. దేశీయంగా ఉల్లి తగినంతగా అందుబాటులో ఉంచడంతోపాటు ధరలను నియంత్రించే ఉద్దేశంతో ఈ చర్యలను తీసుకున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. గడిచిన రెండు రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయనుందన్న వార్తలు జోరుగా ప్రచారం కావడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్రలోని లాసల్ గావ్ లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. క్వింటాల్ ఉల్లి ధర 1280 నుంచి 1800 రూపాయలకు పెరిగింది. హోల్ సేల్ 40.62 రూపాయలకు చేరింది. రబీ సీజన్లో మహారాష్ట్రలో ఉల్లి పంట దిగుబడి బాగా తగ్గుతుందని అంచనా వేసిన కేంద్రం రానున్న కాలంలో వీటి ధరలు మరింత పెరుగుతాయని భావిస్తోంది. 2023 రబీ సీజన్లో ఉల్లి దిగుబడులు 22.7 మిలియన్ టన్నులుగా ఉందని ప్రభుత్వం అంచనా వేసింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ఉల్లి ప్రధానంగా పండించే రాష్ట్రాల్లో ఈ రబీ సీజన్ లో దిగుబడులు తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మార్చి 31 తర్వాత కూడా ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంటర్ మినిస్ట్రీయల్ గ్రూప్ అనుమతితో స్నేహపూర్వక దేశాలకు పరిమితంగా ఎగుమతులు చేస్తున్నారు.
ఉల్లి ఎగుమతుల్లో భారత్ అగ్రగామి దేశం
ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ఎగుమతుల్లో భారత్ అగ్రగామి దేశంగా ఉంది. భారత్ నుంచి ఏటా అనేక దేశాలకు ఉల్లి ఎగుమతులు అవుతుంటాయి. దేశీయంగా ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో విదేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా రబీ సీజన్ లో ఆశించిన మేర ఉల్లి దిగుబడులు లేకపోవడంతో వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు కొరత తప్పక పోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎగుమతులపై నిషేధం మూలంగా ధరలు కొంత స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రబీలో కనీసం 30 శాతం ఉల్లి సాగు తగ్గిందని వ్యవసాయ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో తగినంత వర్షపాతం లేకపోవడంతో పంట సాగుపై ప్రభావం పడింది. ఫలితంగా దిగుబడి 13 శాతానికిపైగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉల్లి నిల్వలు, దిగుబడులపై సరైన అంచనా లేకుండా ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తే సమస్య తీవ్రంగా మారుతుందని ప్రధానమైన ఉల్లి ఎగుమతిదారులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వ్యాపారుల ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను కలిసి ఈ మేరకు విన్నవించారు. ఇప్పటికే మూడు లక్షల ఉల్లి ఎగుమతులు చేసినందున మళ్లీ కేజీ ఉల్లి 35 నుంచి 45 రూపాయలకు పెరిగిందని తెలిపారు. నాసిక్ లో 50 నుంచి 60 రూపాయలకు ఉల్లి ధర చేరిందని వెల్లడించారు. రంజాన్ వస్తున్నందున మార్చిలో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని ఈ ట్రేడర్స్ స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రుల బృందం మూడు లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వడం పట్ల ఈ వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. 250 నుంచి 300 టన్నుల వరకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వవచ్చని వీరు స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లిగడ్డలకు తీవ్రమైన కొరత ఏర్పడిందని ఈ ట్రేడర్స్ తెలిపారు. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లి టన్నుకు 1000 నుంచి 1400 డాలర్ల వరకు ఉందని, ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న ఉల్లిగడ్డలు టన్నుకు 350 డాలర్లు లభిస్తున్నాయని తెలిపారు. కొంతమంది వ్యాపారులు టమాట ఇతర కూరగాయల పేరుతో, తప్పుడు లేబుల్స్ తో ఎగుమతులు చేస్తున్నారని వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
వీటిని అరికట్టడం ద్వారా దేశీయంగా ధరల పెరుగుదలను అదుపు చేయవచ్చని వీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ మార్గంలో విదేశాలకు ఎగుమతులు చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధించేందుకు సిద్ధమవుతోంది. ఏదిఏమైనా దేశీయంగా ఉల్లి ధరను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలను చేపడుతోంది.