Rameshwaram Cafe Blast: ఎన్ఐఏ చేతికి రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు, కేంద్రం ఉత్తర్వులు జారీ
Rameshwaram Cafe blast probe: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
MHA hands over Bengaluru Rameshwaram Cafe blast probe: ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చేతికి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తు చేసేందుకు కేసు బదిలీ చేయడంతో రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనపై తాజాగా ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ పేలుడు జరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎన్ఐఏ చేతికి కేసు దర్యాప్తు వివరాలు..
బెంగళూరు నగరంలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో గత శుక్రవారం (మార్చి 1) మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది వరకు గాయపడ్డారు. పేలుడుపై బెంగళూరు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును బదిలీ చేయడంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దర్యాప్తు వివరాలను ఎన్ఐఏకు అప్పగించనున్నారు. కేఫ్‌లో పేలుడు దర్యాప్తును ఎన్‌ఐఏకు బదిలీ చేసేందుకు సిద్ధమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే వెల్లడించారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటన కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముందు ఇది సిలిండర్ పేలుడు అని భావించినా ఆ తరవాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్‌లో ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. అందులోనే పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పెట్టినట్టు అనుమానించారు. ఆ తరవాత ఫోరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. IED పేలుడు సంభవించినట్టు సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. కేసులో కీలక సాక్ష్యాలు వెలుగులోకి వస్తున్నాయి. CC కెమెరా ఫుటేజ్‌లో ఓ వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌లోకి వచ్చినట్టు రికార్డ్ అయింది. అతనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బెంగళూరు కేఫ్ లో పేలుడుతో హైదరాబాద్ లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఈ వ్యక్తే కేఫ్‌లోకి వెళ్లి అక్కడ బ్యాగ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరవాత కాసేపటికే పేలుడు సంభవించింది. సీసీ ఫుటేజ్‌లో అనుమానితుడు మాస్క్, కళ్లజోడు పెట్టుకుని ఉన్నాడు. ఈ అనుమానితుడితో పాటు ఉన్న వ్యక్తిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 1వ తేదీన మధ్యాహ్నం 12.50, ఒంటిగంట మధ్య కాలంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు పది మంది గాయపడ్డారు. NIA రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది. ఈ పేలుడులో గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను అనవసరంగా రాజకీయం చేయొద్దని సిద్దరామయ్య కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐకి బదిలీ చేసింది.