Bengaluru Crime News: తరచూ గొడవ పడుతోందని తల్లిని చంపిన కుమార్తె, ఆపై ఏం చేసిందో తెలిస్తే షాక్!
Bengaluru Crime News: తరచూ తనతో తల్లి గొడవ పడుతోందని ఆమెను చంపేసిందో కూతురు. ఆ తర్వాత తల్లి మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయింది.
Bengaluru Crime News: నవమాసాలు మోసి కని పెంచి, ఆపై పెళ్లి చేసి అత్తవారింటికి పంపించింది. ఆమె భర్త చనిపోవడంతో.. గత కొంతకాలం నుంచి ఆమె తన కూతురు, అల్లుడు వద్దే ఉంటోంది. ఈక్రమంలోనే ఆమెకు తన కూతురుతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి చేసే గొడవ భరించలేని కూతురు.. కన్నతల్లినే కడతేర్చింది. ఆపై ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కింది. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయింది.
అసలేం జరిగిందంటే?
పశ్చిమ బెంగాల్ కు చెందిన 39 ఏళ్ల సెనాలి సేన్ గత కొంత కాలంగా బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. ఫిజియో థెరఫిస్ట్ గా పని చేస్తున్న ఆమె తన భర్త, అత్త, తల్లితో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటోంది. అయితే సోమవారం తన తల్లితో గొడవ పడిన సెనాలి ఆమెను చంపేసింది. అనంతరం ఆమె మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసు లో కుక్కి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. సెనాలిని చూపి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. తల్లి తనతో తరచుగా గొడవ పడుతోందని అందుకే ఆమెను చంపేసినట్లు సెనాలి పోలీసుల ఎదుట అంగీకరించింది. ఆహారంలో నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేసినట్లు తెలిపింది. ఘటన సమయంలో సెనాలి భర్త ఇంట్లో లేరు. అత్త ఇంట్లోనే ఉన్నా ఆమెకు ఈ హత్య గురించి తెలియకపోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ముంబయిలో దారుణ ఘటన
ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్ హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.
"మనోజ్ సానే, సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సరస్వతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని మనోజ్ గమనించాడు. దీనిపై మూడు, నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వివాదం ముదిరింది. మూడు రోజుల క్రితమే ఆమె విషం మింగి చనిపోయింది. పోలీసులు తనను అనుమానిస్తారేమో అన్న భయంతో డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూశాడు. కట్టర్‌తో శరీరాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని దాచి పెట్టాడు. కొన్నింటిన కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. బైక్‌పై వాటిని పెట్టుకుని వాటిని పారేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ ఇంటిని సీజ్ చేసి ఆ మహిళ శరీర భాగాల్ని సేకరించాం"