Assam Earthquake: గాఢనిద్రలో ప్రజలు, 5.1 తీవ్రతతో అస్సాంలో భారీ భూకంపం.. భయంతో లేచి ఇళ్ల నుంచి పరుగులు
Earthquake in Assam | అస్సాం మోరిగావ్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు ఈశాన్య భారతదేశమంతటా వ్యాపించాయి. ప్రస్తుతానికి ప్రాణనష్టం ఆస్తి నష్టం సంభందించి వివరాలు రాలేదు.

Assam Earthquake | అస్సాంలో సోమవారం (5 జనవరి) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం, భూకంప కేంద్రం అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో నమోదైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. అస్సాంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం సోమవారం ఉదయం సుమారు 4 గంటల 17 నిమిషాలకు సంభవించింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో నిద్రలో ఉన్న వారు మెలుకుని ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది..
అస్సాంతో పాటు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం ఉంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 50 కిలోమీటర్ల లోతులో ఉండటంతో, ప్రకంపనలు చాలా దూరం వరకు వ్యాపించాయి. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భూ ప్రకంపనలు నమోదయ్యాయి.
ఎలాంటి నష్టం లేదు
తాజాగా సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదు. అధికారులు, విపత్తు నిర్వహణ విభాగం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సున్నితమైన ప్రాంతాల నుంచి నిరంతరం సమాచారం సేకరిస్తున్నారు.
An earthquake with a magnitude of 5.1 on the Richter Scale hit Morigaon, Assam, at 04:17:40 IST today: National Centre for Seismology (NCS) pic.twitter.com/xd4JGvr5VG
— ANI (@ANI) January 4, 2026
అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి
ప్రజలు వదంతులను నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని అస్సాం అధికారులు విజ్ఞప్తి చేశారు. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు సూచించే భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం
అస్సాం చరిత్రలో భూకంపాల వల్ల పలు విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతం దేశంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఒకటిగా ఉంది. దీనికి ప్రధాన కారణం భారత ప్లేట్, యురేషియన్ ప్లేట్ ఢీకొనడమే అని నిపుణుల అభిప్రాయం. ఈ ఘర్షణ కారణంగా భూమి లోపల తరచుగా కదలికలు వస్తూ, తీవ్రమైన ప్రకంపనలు నమోదవుతాయి.
1897 నాటి షిల్లాంగ్ భూకంపం, అన్నీ కుదిపేసింది
12 జూన్ 1897న సంభవించిన షిల్లాంగ్ భూకంపం అస్సాం, మొత్తం ఈశాన్య భారతదేశానికి భయంకరమైన విపత్తుగా మారింది. ఈ భూకంపం తీవ్రత 8 కంటే ఎక్కువగా నమోదైంది. వేలాది మంది ప్రజలు దీని బారిన పడి నష్టపోయారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. భారీ సంఖ్యలో ఇళ్లు, రోడ్లు, భవనాలు కూలిపోయాయి. ఈ భూకంపం ప్రభావం ఎంతగా ఉందంటే, కలకత్తా వంటి దూర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనుల ప్రభావం కనిపించింది.






















