CDS Anil Chauhan: త్రివిధ దళాలకు కొత్త బాస్‌గా అనిల్ చౌహాన్ నియమాకం!
CDS Anil Chauhan: భారత త్రివిధ దళాళ కొత్త అధిపతిగా అనిల్ చౌహాన్ ను కేంద్రం నియమించింది. బిపిన్ రావత్ మరణానంతరం 9 నెలలుగా ఖాళీగా ఉన్న పోస్టును ఇప్పుడు భర్తీ చేసింది.
CDS Anil Chauhan: భారత త్రివిధ దళాల నూతన అధిపతి(CDS)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వ నియమించింది. జనరల్ బిపిన్ రావత్ గత ఏడాది డిసెంబరులో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసినప్పటి నుంచి దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న సీడీఎస్ పోస్టుకు... అనిల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్టు బుధవారం రోజున కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. అనిల్ చౌహాన్ త్రివిధ దళాల అధిపతిగానే కాకుండా.. రక్షణ శాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గత ఏడాది మే నెలలోనే అనిల్ చౌహాన్ పదవీ విరమణ చేశారు. ఈస్టర్న్ కమాండర్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ రిటైర్ అయ్యారు. 40 ఏళ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో అనిల్ చౌహాన్ పని చేశారు. 1961 మే 18 న అనిల్ చౌహాన్ జన్మించారు. 1980వ సంవత్సరంలో ఆయన ఆర్మీలో చేరారు.
ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ గా పదవీ విరమణ
ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ము కశ్మీర్ లో స్థానికుల తిరుగుబాటును కట్టడి చేయడంలో అనిల్ చౌహాన్ కీలకంగా పని చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఖడక్ వాస్లా), ఇండియన్ మిలిటరీ అకాడమీ(డెహ్రాడూన్) లో శిక్షణ పొందారు. 1981 లో సైన్యంలోని 11 గోర్ఖా రైఫిల్స్ లో చేరడంతో ఆయన సర్వీసు ప్రారంభం అయింది. గత ఏడాది మేలో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ గా పని చేస్తున్నప్పుడు అనిల్ చౌహాన్ పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ నేతృత్వంలోని జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్ఎస్సీఎస్)లో సైనిక సలహాదారుడిగా చౌహాన్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ పొందన ఓ త్రీస్టార్ అధికారి.. ఫోర్ స్టార్ హోదా(సీడీఎస్) లో క్రియాశీల సర్వీసులో తిరిగి చేరడం ఇదే తొలిసారి కానుంది. ఆఫ్టర్ మాథ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ అటాక్ పేరుతో చౌహాన్ రాసిన పుస్తకం 2010లో ప్రచురితం అయింది. 11 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్ చరిత్ర కూడా ఆయన రాశారు. ఈస్టర్న్ కమాండ్ లో దీర్ఘకాలం పాటు సేవలు అందించిన అనిల్ చౌహాన్ కు చైనా వ్యవహారాలు నిర్వర్తించే మంచి నిపుణుడిగా పేరు ఉంది.
పరమ్ విశిష్ట్ సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ్ సేవా మెడల్, విశిష్ట్ సేవా మెడల్, అతి విశిష్ట్ సేవా మెడల్ సహా పలు పురస్కారాలు అందుకున్నారు అనిల్ చౌహాన్. త్రివిధ దళాల అధిపతిగా నియమితులైన రెండో వ్యక్తి అనిల్ చౌహానే. గతేడాది డిసెంబర్ లో తమిళనాడులోని నీలగిరికొండల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతిచెందారు. ఓ కార్యక్రమానికి భార్యతో సహా వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య సహా మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.