Amarinder Singh Resigns: ముదిరిన సంక్షోభం.. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా..
Amarinder Singh Resigns: పంజాబ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పంజాబ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతోనే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన శనివారం నాడు తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో అమరీందర్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అధిష్టానం నిర్ణయం తోనే రాజీనామా చేశారని సమాచారం.
Also Read: సీఎం అమరీందర్ వర్సెస్ సిద్దూ.. ఉత్కంఠరేపుతోన్న పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం
పంజాబ్ కాంగ్రెస్‌లో ముదిరిన వివాదం..
గత కొంతకాలం నుంచి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వర్సెస్ సిద్దూ అన్నట్లుగా పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి. పంజాబ్ రాజీకీయంఈ రోజు మరో కొత్త మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ రాజీనామా చేశారు. కొంత కాలంగా సిద్దూ వ్యవహార శైలితో తాను విసిగిపోయానంటూ అమరీందర్ పలుమార్లు అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తన పదవికి సీఎం రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి.
కాంగ్రెస్ హై కమాండ్ సిద్దూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో విభేదాలు మొదలయ్యాయి. అధిష్టానంతో చర్చించి పదవి ఇప్పించినప్పటికీ.. పార్టీ ఎమ్మెల్యేలతో సిద్దూ తరచుగా సమావేశాలు ఏర్పాటు చేయడం.. అందులోనూ సీఎం అయిన తనపై సైతం వ్యతిరేకంగా ప్రచారం చేశాడని అమరీందర్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీలోనే తనకు మద్దతు కరువవడంతో.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగడం కష్టమేనని అమరీందర్ సింగ్ భావించారు. సిద్ధూ ప్రోద్భలంతో కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అమరీందర్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం.
Also Read: ఉప ఎన్నిక వేళ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్.. తృణమూల్ పార్టీలోకి బాబుల్ సుప్రియో
ఒకవైపు సీఎం అమరీందర్ సింగ్ అసహనం వ్యక్తం చేస్తున్న సందర్భంలో.. మరోవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుండటం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి అమరీందర్ చేరుకోవాల్సిన లక్ష్యాల పురోగతిపై సమీక్ష జరగనున్నట్టు తెలుస్తోంది. హైకమాండ్ కు తనపై ఫిర్యాదులు వెళ్లడం, సిద్ధూ వర్గం తనపై కుట్ర పన్నుతుండటంతో అధిష్టానం నిర్ణయం కోసం అమరీందర్ ఎదురుచూశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం తన పరిస్థితిని అమరీందర్ ఇదివరకే వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకతను తప్పించుకోవడానికి సైతం సీఎం మార్పు అవసరమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావించారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశం పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.