Mallikarjun Kharge: లోక్ సభ ఎన్నికలకు ఖర్గే దూరం! - కారణం ఏంటంటే?
Aicc Chief: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ నియోజకవర్గానికే పరిమితం కాకుండా దేశమంతా తన సేవలు అవసరం ఉన్నాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
Aicc Chief Mallikarjun Kharge May Skip Loksabha Election Contest: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేస్తారని.. కాంగ్రెస్ జాబితాలో పేరు కూడా చేర్చినట్లు సమాచారం. కానీ, ఖర్గే తన అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి బరిలో దించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్గే గుల్బార్గా నుంచి రెండుసార్లు పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో అదే నియోజక వర్గంలో బరిలో నిలవగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉంది. కాగా, ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన కూడా గుల్బూర్గా నుంచి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో అల్లుడిని బరిలోకి దించాలని ఖర్గే యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే కారణమా.?
తాను ఒక నియోజకవర్గానికే పరిమితం కాకూడదనే మల్లికార్జున ఖర్గే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశమంతటా తన సేవలు అవసరం ఉన్నాయని ఖర్గే తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయని దాఖలాలు లేవు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో బరిలో నిలిచి గెలిచారు. కానీ, 2019 ఎన్నికల్లో అమేథి నియోజకవర్గంలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన వయనాడ్ నుంచి గెలుపొందారు. అటు, బీజేపీలో కూడా, ఈసారి జేపీ నడ్డా పోటీ చేయనప్పటికీ, 2014, 2019లో, అప్పటి బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలు.. లక్నో, గాంధీనగర్ నుంచి బరిలో నిలిచి భారీ విజయాలు సాధించారు.
మరోవైపు, ఇండియా కూటమి చివరి సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను ప్రతిపక్ష కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ అంశంపై చర్చ జరగాలని ఖర్గే నిరాకరించారు.
ప్రియాంక గాంధీ తొలిసారి పోటీ
అటు, ఇప్పటివరకూ పార్టీ ప్రచారంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఆమె తొలిసారిగా యూపీలోని రాయబరేలీ నుంచి పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈసారి అమేథీ, వయనాడ్ నుంచి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో రాహుల్ అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. అదే ఎన్నికల్లో వయనాడ్ నుంచి గెలుపొంది లోక్ సభలో అడుగుపెట్టారు. అమేథీ నుంచి బీజేపీ తరఫున స్మృతి ఇరానీ పోటీ చేయడం ఇప్పటికే ఖరారైంది. అటు, రాయబరేలీ నుంచి బీజేపీ తరఫున ఎవరు పోటీలో ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Also Read: CAA: సీఏఏ అమలు - కేంద్రంపై తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తీవ్ర అసహనం, ఫస్ట్ రియాక్షనే పీక్స్