(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi Speech: ప్రధాని మోడీ ప్రసంగాలకు ఏఐ మెరుపులు- బీజేపీ అదిరిపోయే వ్యూహం
Modi News: ప్రధానమంత్రి మోడీ ప్రసంగాలు మరింత వన్నెలీననున్నాయి. ఏ రాష్ట్రానికి ఆయన వెళ్లినా.. అక్కడి స్థానిక భాషలో ఆయనప్రసంగాలు తక్షణం తర్జుమా జరిగేలా ఏఐ సాంకేతికత వినియోగిస్తున్నారు.
How Modi Speak In Local Language: తెలంగాణ పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అదే మోదీ గ్యారంటీ అంటూ ప్రసంగించారు. ఒక్క తెలుగులోనే కాదు వెళ్లిన ప్రతి రాష్ట్రంలో ఆ లోకల్ భాషలో మాట్లాడుతున్నారు. ఇక్కడ వరకు ఓ లెక్క. చేసిన అభివృద్ధిని ఆయా లోకల్ భాషలో చెబుతూ ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారుతోంది.
దేశంలో సార్వత్రిక ఎన్నికల (General Elections) కోలాహలం ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీలూ (Political Parties) ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ(BJP) ఆ దిశగా వడివడి అడుగులు వేస్తోంది. బీజేపీకి ప్రధాన ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)నే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నెల 3నే రాష్ట్రాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా సుమారు 12 రాష్ట్రాల్లో ఆయన పర్యటించాలని, ప్రజలను బీజేపీవైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యంగా బీజేపీ అంత బలంగా లేని దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని ఫోకస్ పెంచారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక(ఇక్కడ బీజేపీ బాగానే ఉంది), ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరించేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో ప్రధాని ఇటీవల తమిళనాడు, కేరళ, తమినాడుల్లో పర్యటించారు కూడా. అయితే.. ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని వస్తున్న ప్రధాన అవరోధం భాషా సమస్య. ఇక్కడి మెజారిటీ ప్రజలకు హిందీపై పట్టులేదు. ప్రధానికి మాత్రం హిందీలో అనర్గళంగా దంచికొట్టగల ఓర్పు, నేర్పు ఉన్నాయి. దీంతో ఆయన చెప్పేది ఏదైనా ఇక్కడి ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరడం ఇబ్బందిగా మారింది. ఈ గ్యాప్‌ను తగ్గించడంపై ఇప్పుడు బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది.
ఏం చేస్తారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) హిందీయేతర(Except Hindi speaking states) రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో చేసే ప్రసంగాలను ఏఐ(AI) సాంకేతికతను వినియోగించి.. తక్షణమే స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తారు. అంటే.. ఇవి వేరే వారి గొంతుతో ఉండవు. నేరుగా ఆయా భాషల్లో ప్రధాని మాట్లాడుతున్నట్టుగానే, ప్రజలతో స్థానిక భాషలలో సంభాషిస్తున్నట్టుగానే ఉంటాయి. తద్వారా ప్రజలకు-ప్రధానికి మధ్య భాషా పరమైన సమస్యను 100 శాతం తగ్గించవచ్చన్నదిబీజేపీ వ్యూహం. దీంతో ప్రధాని చెప్పే కీలక విషయాలను ప్రజలు తమ తమ భాషల్లో సునాయాశంగా అర్ధం చేసుకోగలుగుతారని పార్టీ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలను ఈ తరహాలో ఆకట్టుకుంటే.. బీజేపీకి సానుకూలత పెరుగుతుందనేది కమల నాథుల ప్రధాన ఆలోచన. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రసంగాలను అప్పటికప్పుడే.. స్థానిక భాషల్లో అనువదించను న్నారు. అంటే.. వేరే ఎవరూ అనువదించినట్టుగా ఉండదు. స్క్రీన్‌పై ప్రధాని స్వచ్ఛంగా సదరు స్థానిక భాషలోనే మాట్లాడినట్టుగా ఏఐ ప్రధాని ప్రసంగాలను తర్జుమా చేస్తుంది. ఎక్కడా చిన్న లోపం లేకుండా.. సదరు ప్రాంతీయ భాషలో ఎలాంటి ఉచ్ఛారణ సమస్యలు లేకుండాకూడా ఏఐ ఈ ప్రసంగాలను తీర్చిదిద్దనుంది.
విస్తృత ప్రయోజనం దిశగా
ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాదిన మంచి ఓటు బ్యాంకు ఉంది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది. దీనికి కారణం మాటల మాంత్రికుడుగా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టు కోవడమే. ఆయన చెప్పే హిందీ ప్రసంగాలు ఉత్తరాది వారిని అమితంగా ఆకట్టుకోవడమే. తద్వారా.. ఆయన ప్రజలకు చాలా దగ్గరగా చేరువయ్యారు. అదే దక్షిణాదిని తీసుకుంటే.. భాషా పరమైన ఇబ్బంది.. ప్రధాని మోడీకి-దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రజలకు తటస్థంగా ఉంచింది. ఆయన ఎక్కడైనా ప్రసంగాలు చేసినా.. వాటిని ఇతర నేతలు తర్జుమా చేసినా.. మక్కీకి మక్కీ.. మోడీ చెప్పినట్టు.. మనసును హత్తుకునేట్టు ఉండవు. దీంతో ఓటు బ్యాంకు బీజేపీకి చేరువ కాలేక పోతోందని నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ సాయంతో మోడీ ప్రసంగాలను తక్షణం స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి.. ప్రజలకు చేరువ కావాలని కమల నాథులు ప్లాన్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు పెరగడంతోపాటు కేంద్రంలో ప్రధాని మోడీ తమకు ఏం చేస్తున్నార కూడా వారికి అర్ధం కానుందని.. ఇది తమకు ఓటు బ్యాంకును మోసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత టూల్ ద్వారా.. మోడీ ప్రసంగాలను అనువదించి.. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయనుంది. మరి చూడాలి ఏమేరకు ఇది ఫలిస్తుందో.