Low Rainfall: దేశంలో 2002 నాటి పరిస్థితులు, వచ్చే రెండు వారాలే కీలకమంటున్న వాతావరణ శాఖ
Low Rainfall: భారతదేశంలో భూములు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూములు తేమ శాతాన్ని కోల్పోతున్నాయి. దేశంలోని భూ భాగంలో దాదాపు 31% భూమి నీరు లేక మెట్టభూమిగా మారుతోంది.
Low Rainfall: భారతదేశంలో భూములు ఎండిపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో భూములు తేమ శాతాన్ని కోల్పోతున్నాయి. దేశంలోని భూ భాగంలో దాదాపు 31% భూమి నీరు లేక మెట్టభూమిగా మారుతోంది. జూలై 27-ఆగస్టు 23 కాలానికి సంబంధించిన మెట్ డిపార్ట్‌మెంట్ ప్రామాణిక అవపాత సూచిక (SPI) డేటా ఈ వివరాలు వెల్లడించింది. ఇది వ్యవసాయం, పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) నిపుణుల బృందం ఈ SPI అనే కొలతను రూపొందించింది.
ఇది వివిధ సమయ ప్రమాణాలలో వాతావరణంలో మార్పులు, వర్షాపాతం లోటు వివరాలను తెలియచేస్తుంది. దేశంలో చాలా చోట్ల గత నెల రోజులుగా రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. దేశంలో 31 శాతం భూభాగం పొడిబారుతోంది. మరో 9 శాతం తీవ్రంగా పొడిగా ఉంది. అదనంగా 4 శాతం విపరీతమైన నీటి ఎద్దడిని అనుభవిస్తున్నట్లు డేటా తెలిపింది.
దక్షిణ భారతంలో చాలా ప్రాంతాలు, మహారాష్ట్ర, గుజరాత్‌లోని పలు జిల్లాలు, తూర్పు భారతదేశంలోని కొన్ని విభాగాలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలాచోట్ల భూమిలో తేమ శాతం గణనీయంగా తగ్గుతోంది. SPI డేటా మేరకు చాలా వరకు భూములు పొడిబారుతున్నాయి. భారతదేశంలో 47% ప్రాంతం భూమి తేలికపాటి పొడి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫలితంగా నేల తేమ తగ్గడానికి దారితీస్తాయని, ఇది పంట పెరుగుదల, వ్యవసాయ దిగుబడులపై ప్రభావితం చూపుతుందని నిపుణులు తెలిపారు.
రాబోయే 2 వారాలు చాలా కీలకం
భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘దేశంలో చాలా వరకు భూభాగం చాలా వరకు నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. రానున్న రెండు వారాలు కీలకం. వర్షాలు కురిస్తే దీని ప్రభావం తగ్గే అవకాశం ఉంది. వానలు కురవకపోతే నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి ఆగస్టు 23 వరకు సీజనల్ ఎస్‌పీఐ నివేదికలో కూడా చాలా జిల్లాలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి 2002ను తలపిస్తోంది. జూలైలో రుతు పవనాలు 26 రోజులు బలహీనంగా ఉన్నాయి. ఫలితంగా వర్షాలు అనుకున్నంత స్థాయిలో కురవలేదు.
తగినంత నీటి లభ్యత లేకపోవడంతో పంటలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు సరస్సులు, జలాశయాలు, భూగర్భ జలాల స్థాయిలు పడిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా సరస్సులు, జలాశయాలు నీరు ఎక్కవగా బాష్పీభవనం అవుతోంది. అయితే, సెప్టెంబరులో వర్షాలు కురిస్తే ఈ వర్షాభావాన్ని కొంత వరకైనా పూడ్చే అవకాశం ఉంది.
ఎల్ నినో ఈ నెలలో బలంగా ఉండడంతో ఆగస్టులో రుతుపవనాలపై దాని ప్రభావం పడిందని నివేదికలు తెలిపాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తులు చేస్తున్నాం. త్వరలో హిందూ మహాసముద్రం ద్విధ్రువ (IOD) ఏర్పడేందుకు అవకాశం ఉంది. అయితే అది కూడా రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ ఐఓడీ ఏర్పడుతుందని సానుకూలంగా ఉన్నాం.’ అని వివరించారు.