Bengaluru News: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ప్రభుత్వం చెక్, 190 కిలోమీటర్ల సొరంగ రహదారులు
Bengaluru News: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 190 కిలోమీటర్ల సొరంగ రహదారులు ప్రతిపాదించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

Bengaluru News: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 190 కిలోమీటర్ల సొరంగ రహదారులు ప్రతిపాదించినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ టెండర్లను ఆహ్వానిస్తుందన్నారు. విధానసౌధలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోవడానికి 190 కిలోమీటర్ల సొరంగ రహదారిని ప్రతిపాదించామని, ఎనిమిది కంపెనీలు దీనికి అర్హత సాధించాయని చెప్పారు. ఈ కంపెనీలు సొరంగ మార్గం నిర్మాణం సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించిన తరువాత టెంటర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
టన్నెల్ రోడ్డు ఎలా ఉండాలి? నాలుగు లేదా ఆరు లేన్‌లుగా ఉండాలా? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ముగించాలి? అనే విషయాలపై ఈ సంస్థలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తాయని, నగరమంతటా విస్తరించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని డీకే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దదని, భారీ మొత్తంలో నిధులు అవసరం అవుతాయన్నారు. దీనిని అనేక దశల్లో పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతానికి 190 కి.మీ.లు ప్రతిపాదించామని, బళ్లారి రోడ్డు, పాత మద్రాస్ రోడ్డు, ఎస్టీమ్ మాల్ జంక్షన్ నుంచి మేఖ్రీ సర్కిల్, మిల్లర్ రోడ్డు, చాళుక్య సర్కిల్, ట్రినిటీ సర్కిల్, సర్జాపూర్ రోడ్డు, హోసూరు రోడ్డు, కనకపుర రోడ్డు నుంచి కృష్ణారావు పార్కు, మైసూర్ రోడ్డు నుంచి సిర్సీ సర్కిల్ , మాగాడి రోడ్డు, తుమకూరు రోడ్డు నుంచి యశ్వంత్‌పూర్ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు, గొరగుంటెపాళ్యం, కేఆర్ పురం, సిల్క్ బోర్డు ప్రాంతాలను గుర్తించినట్లు చెప్పారు.
ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ ప్రాంతాలను ఎంపిక చేశామని, ఈ సొరంగం రహదారిని ఎక్కడ, ఎలా తయారు చేయవచ్చనే దానిపై కంపెనీలు అధ్యయనం చేయబోతున్నాయని చెప్పారు. బెంగళూరు అవసరాల దృష్ట్యా కనీసం నాలుగు లైన్ల టన్నెల్ రోడ్డు అవసరమని ఆయన అన్నారు. వర్షాకాలం ముగుస్తున్నందున నేపథ్యంలో డ్రైనేజీతో సహా, అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చే బాధ్యతను చీఫ్ ఇంజనీర్లకు అప్పగించినట్లు శివకుమార్ చెప్పారు. గత వారం బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ రద్దీ గురించి మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులతో ఈ సమస్యను చర్చించినట్లు తెలిపారు.
అక్టోబరు 7న ఔటర్ రింగ్ రోడ్డు సందర్శన
బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఇంజనీర్లు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో గుంతల సమస్యను పరిష్కరించాలని డీకే సూచించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాలలో BBMP త్వరగా గుంతలను పూడ్చాలని, తద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా గుంతల గురించి BBMP కమిషనర్‌కు తెలియజేయవచ్చని, వర్షం వచ్చినప్పుడు, గుంతలు పడటం సాధారణని అన్నారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.
బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కేంద్రం సహాయం కోరతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తప్పకుండా కేంద్రం నుంచి సాయం కోరతామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత, కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తామన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించానని, సమస్య గురించి ఆయనకు వివరించినట్లు చెప్పారు. దీనిపై నితిన్ గట్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

