MPs Facing Criminal Charges: 306 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు, టాప్ లో బీజేపీ నేతలు: ఏడీఆర్ నివేదిక
MPs Facing Criminal Charges: 40 శాతం మంది ఎంపీలపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
MPs Facing Criminal Charges: లోక్ సభ, రాజ్యసభలోని 763 మంది సిట్టింగ్ ఎంపీలలో 306 మంది అంటే 40 శాతం మంది ఎంపీలపై హత్యలు, మహిళలపై అత్యాచారం లాంటి నేరారోపణలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తాజా అధ్యయనం దేశంలోని సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుల క్రిమినల్ బ్యాగ్రౌండ్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. మంగళవారం విడుదల చేసిన ఏడీఆర్ నివేదిక ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభలోని 763 మంది ఎంపీలలో 306 (40 శాతం) మంది తమపై హత్యలు, మహిళలపై దాడి లాంటి నేరారోపణలు ఉన్నట్లు నేతలు స్వయంగా ప్రకటించారు.
ఏడీఆర్ నివేదిక క్రిమినల్ కేసులను వర్గీకరించింది. సిట్టింగ్ ఎంపీల్లో 194 మంది అంటే 25 శాతం మంది ఎంపీలు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై అత్యాచారం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న మొత్తం మంది ఎంపీల్లో 139 మంది ఎంపీలు బీజేపీ పార్టీ నుంచి ఉండగా.. 49 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి మొత్తం 385 మంది ఎంపీలు ఉండగా అందులో 139 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 81 మంది ఎంపీలు ఉండగా.. అందులో 43 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
Party-wise MPs with self-declared criminal cases. (Source: ADR Report)
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)కి చెందిన 36 మంది ఎంపీల్లో 14 మంది క్రిమినల్ కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ద్రవడి మున్నేట్ర కజగం (DMK) పార్టీకి 34 మంది ఎంపీలు ఉండగా 13 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. జనతాదళ్ (యునైటెడ్)(JDU) పార్టీకి 21 మందిఎంపీలు ఉంటే అందులో 13 మందిపై కేసులు ఉన్నాయి. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురిపై, సీపీఐ పార్టీకి చెందిన 8 మంది ఎంపీల్లో ఆరుగురిపై కేసులు ఉన్నాయి. అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి 11 మంది ఎంపీలు ఉండగా ముగ్గురు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)కి 8 మంది ఎంపీలు ఉండగా ముగ్గురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు 31 మంది ఉండగా.. అందులో 13 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉండగా.. ఆరుగురు ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ముగ్గురిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలుగు దేశం పార్టీకి నలుగురు ఎంపీలు ఉండగా.. ఒక్కరు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
11 మంది సిట్టింగ్ ఎంపీలపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 32 మంది ఎంపీలపై ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయి. 21 మంది ఎంపీలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. అందులో నలుగురు ఎంపీలపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి సంబంధించిన అభియోగాలు ఉన్నాయి.
అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సిట్టింగ్ ఎంపీలు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. 108 మంది ఎంపీల్లో 49 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మొత్తం 57 మంది ఎంపీలు ఉండగా 25 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.
(Source: ADR Report)