Defence Budget 2024: బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు, ఆత్మనిర్భరత దిశగా భారత్
FM Nirmala Sitharaman: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేసింది. ఆత్మనిర్భరత సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించింది.
Union Budget 2024 Updates in Telugu: కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. భారీ కేటాయింపులతో మరింత ఊపునిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.6 లక్షల 21 వేల 940 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించగా ఈ సారి ఈ వాటాని మరింత పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 4.72% మేర ఎక్కువగా ఈ సారి నిధులు కేటాయించింది. ఈ ఏడాది మొత్తం బడ్జెట్‌లో డిఫెన్స్ సెక్టార్‌కే 12.9% మేర నిధులు కేటాయించిన కేంద్రం రక్షణ రంగానికి తాము ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో తేల్చి చెప్పింది. ఆత్మనిర్భరతలో భాగంగా విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకుని దేశీయంగా ఆయుధాలు, ఇతరత్రా యుద్ధ సామగ్రిని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే నిధులు కేటాయింపులు జరుపుతోంది. ఇక పెన్షన్ బడ్జెట్‌నీ రూ.1.41 లక్షల కోట్లకు పెంచింది. Border Road Development కోసం కేంద్రం ప్రత్యేకంగా రూ.6,500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇక తీరప్రాంతాల రక్షణకు రూ. 7,651 కోట్లు అందించింది. DRDOకి ఇచ్చే నిధులనూ కొంత వరకూ పెంచింది కేంద్రం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో DRDO కి రూ. 23,263 కోట్లు కేటాయించగా ఈ సారి రూ. 23,855 కోట్లకు పెంచింది.
As far as the allocation to Ministry of Defence is concerned, I thank the Finance Minister for giving the highest allocation to the tune of Rs 6,21,940.85 Crore, which is 12.9 % of total Budget of GoI for FY 2024-25.
— Rajnath Singh (@rajnathsingh) July 23, 2024
The capital outlay of Rs 1,72,000 Crore will further…
ఈ పద్దుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. సాయుధ బలగాలను మరింత బలోపేతం చేసేందుకు రూ. లక్షా 72 వేల కోట్ల నిధులు కేటాయించినట్టు వివరించారు. తద్వారా ఆత్మనిర్భరత సాధిస్తామని వెల్లడించారు. అటు బోర్డర్ రోడ్స్ అభివృద్ధికీ కేంద్రం ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. రక్షణ రంగ బడ్జెట్ వివరాలన్నీ కలిపి X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. మొత్తం రూ. 44.66 లక్షల కోట్ల బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. వ్యవసాయం, మహిళలు, పేదలు, యువతపై ఎక్కువగా దృష్టి సారించారు. ఈ నాలుగు అంశాల్లో భారీ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చేదోడునిచ్చేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయంలోనూ డిజిటలైజేషన్ తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు శిక్షణ అందిస్తామని తెలిపారు. ఉద్యోగాల కల్పనపైనా ఫోకస్ పెట్టారు. ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్‌ని తీసుకొచ్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నెల జీతం అడ్వాన్స్‌గా ఇచ్చి పీఎఫ్‌లో జమ చేస్తామని ప్రకటించారు. దేశీయ విద్యాసంస్థల్లో చదువుకునే వారికి రూ.10 లక్షల రుణం ఇస్తామని వెల్లడించారు.