India China Border Clash: తవాంగ్‌లో చైనా ఎందుకు తగవుకు దిగింది? ఇరు దేశాలకు ఈ ప్రాంతం అంత వ్యూహాత్మకమా?
Tawang Clash: చైనా తవాంగ్‌పై పట్టు సాధించాలని ఎందుకు చూస్తోంది?
India China Border Clash:
అప్పటి నుంచే గురి..
భారత్, చైనా సైనికుల మధ్య రెండేళ్ల క్రితం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇరు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు చల్లారలేదు. మాటు వేసి దాడి చేయాలని డ్రాగన్ ఎప్పటి నుంచో చూస్తోంది. ఈ మధ్యే రెండు దేశాలు "యుద్ధానికి సిద్ధమే" అన్న స్థాయిలో ప్రకటనలూ చేశాయి. ఈ క్రమంలోనే...మరోసారి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సారి అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని తవాంగ్ (Tawang Clash) వద్ద బాహాబాహీకి దిగారు. ఎంత మంది గాయపడ్డారన్నది స్పష్టంగా తెలియకపోయినా...మరోసారి రెండు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచింది ఈ ఘటన. అయితే....చైనా తవాంగ్‌లో అంత మంది సైనికులను ఎందుకు మోహరించింది..? అన్న ప్రశ్నకు ఒకే సమాధానం.."అరుణాచల్ ప్రదేశ్‌పై ఆధిపత్యం సాధించడం కోసం". ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలో కలుపుకోవాలని కుట్ర చేస్తున్న చైనా...ఈ సారి అక్కడి కీలక ప్రదేశమైన తవాంగ్‌లోనే ఘర్షణకు దిగింది. అసలు చైనా తవాంగ్‌పై ఎందుకు గురి పెట్టింది..? ఈ ప్రాంతం రెండు దేశాలకు ఎందుకంత కీలకం..?
నిఘా పెంచుకునేందుకు..
రెండేళ్ల క్రితం గల్వాన్ గురించే మాట్లాడుకుంటున్నాం కానీ...గతేడాది అక్టోబర్‌లో తవాంగ్‌లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడింది చైనా. దాదాపు 200 మంది చైనా సైనికులు భారత భూభాగమైన తవాంగ్‌లోకి చొచ్చుకుని వచ్చారు. అటు భూటాన్, ఇటు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటోంది తవాంగ్. తూర్పు లద్దాఖ్‌లో ఘర్షణలు జరిగినప్పటి నుంచే వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. అటు చైనా కూడా అదే స్థాయిలో సైనికులను మోహరించింది. వాస్తవానికి...అరుణాచల్ ప్రదేశ్‌ను "దక్షిణ టిబెట్" అని క్లెయిమ్ చేసుకుంటోంది చైనా. అందులోనూ తవాంగ్‌ను ఆక్రమించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక్కడ భారత సైన్యం కదలికలు చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే...తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు తరచూ గొడవలకు దిగుతూ ఉంటుంది చైనా సైన్యం. ఈ ప్రాంతం భారత్‌కు భద్రత పరంగా ఎంతో వ్యూహాత్మకం. 17 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది తవాంగ్. 1962లో యుద్ధం జరిగిన సమయంలోనే ఇక్కడి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంది చైనా. అయితే...ఇది మెక్‌మోహన్ రేఖ కిందకు వస్తుందన్న కారణంగా...క్రమంగా అక్కడి నుంచి బలగాలను వెనక్కు రప్పించింది. అప్పటి నుంచే ఈ ప్రాంతంపై నిఘా పెట్టింది డ్రాగన్. తవాంగ్‌ను సొంతం చేసుకోవాలని చైనా ప్రయత్నించడానికి మరో కారణం...ఇక్కడి నుంచి అటు ఎల్‌ఏసీని, టిబెట్‌లపై ఒకేసారి నిఘా పెట్టే వీలుండటం.
భారత్‌కు అత్యంత కీలకం..
దలైలామాకు, తవాంగ్‌కు ఉన్న రిలేషన్ కూడా చైనా ఈ ప్రాంతంపై కన్నేయడానికి మరో కారణం. 1959లో దలైలామా చైనా అధీనంలోని టిబెట్‌ను వీడి భారత్‌కు తరలి వచ్చారు. పైగా...గతంలో తవాంగ్‌ను టిబెట్‌లో భాగమే అని చెప్పిన దలైలామా...ఆ తరవాత అది అరుణాచల్ ప్రదేశ్‌లని భాగమే అని మాట మార్చారు. భారత్‌లో ఆయనకు ఆశ్రయం దొరకటం ఇందుకు కారణం. ఇది కూడా చైనాను ఇరకాటంలో నెట్టింది. ఇక భారత్ వైపు చూస్తే...తవాంగ్‌తో పాటు చంబా వ్యాలీ కూడా కీలకమే. చైనా భూటన్ సరిహద్దుకి సమీపంలో తవాంగ్ ఉండగా...నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో చంబా ఉంది. అరుణాచల్ మాదే అనే మొండి వాదన చేస్తున్న చైనా...ఈ రెండు ప్రాంతాలనూ సొంతం చేసుకుంటే..దాదాపు విజయం సాధించినట్టే. కానీ...భారత్ మాత్రం చైనా కలను కలగానే మిగిల్చే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. గల్వాన్ ఘర్షణ తరవాత చైనాతో సరిహద్దు పంచుకునే అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక వసతులను పెంచుతోంది. చైనా ఆక్రమణ కాంక్షను ఎదురొడ్డే విధంగా సైన్యానికి పూర్తి స్థాయి మద్దతునిస్తోంది.
Also Read: Gay Marriage Law: సేమ్ సెక్స్ మ్యారేజ్ బిల్లుపై బైడెన్ సంతకం- ఇక ఆ పెళ్లిళ్లకు లైన్ క్లియర్