2047 నాటికి భారత దేశ రూపురేఖలు మారిపోవాలి - ఐడియాస్ ఆఫ్ ఇండియాలో అనీశ్ షా
Ideas of India 2024: దేశంలో ప్రతి వర్గానికీ అభివృద్ధి విస్తరించాలని మహీంద్రా గ్రూప్ గ్రూప్ సీఈవో అనీశ్ షా వెల్లడించారు.
ABP Ideas of India 2024: ప్రస్తుతం భారతదేశం వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తోందని వెల్లడించారు మహీంద్రా గ్రూప్ Group CEO,M&M మేనేజింగ్ డైరెక్టర్ అనీశ్ షా. ఈ అభివృద్ధి దేశంలోని అన్ని వర్గాల్లోనూ కనిపించాలని అన్నారు. ABP నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ముంబయిలో జరుగుతున్న Ideas Of India Summit 2024 సదస్సులో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్‌లో మొట్టమొదట మాట్లాడిన అనీశ్ షా..2047 నాటికి భారత్ ఎలాంటి లక్ష్యాలు సాధించాలో ప్రస్తావించారు. దేశ GDPలో తయారీ రంగం వాటా 25%కి పైగా పెరగాలని ఆకాంక్షించారు. ఇప్పుడున్న దానితో పోల్చి చూస్తే...2047 నాటికి భారత్ నుంచి ఎగుమతులు 11 రెట్లు పెరగాలని అన్నారు. FICCI ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు చేపడుతున్న అనీశ్...భారత్ త్వరలోనే 33 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా గతంతో పోల్చి చూస్తే చాలా మెరుగైందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయంగా కార్‌లు తయారు చేసుకుంటున్నామని, వీటి ద్వారా మంచి బిజినెస్ జరుగుతోందని చెప్పారు. అటు ఈవీ రంగంలోనూ భారత్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆశించిన స్థాయిలోనే ఉందని వివరించారు.
"మన దేశం వికసిత్ భారత్ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇలాంటి కీలక సమయంలో అభివృద్ధి అనేది అన్ని వర్గాలకూ చేరువ కావాలి. 2047 నాటికి భారతదేశ రూపురేఖలు మారిపోవాలి. తలసరి ఆదాయం పెరగాలి. అప్పటికి దేశ జీడీపీలో తయారీ రంగం వాటా 25%కి మించి నమోదవ్వాలి. ఎగుమతులు కూడా 11 రెట్లు పెరగాలని ఆకాంక్షిస్తున్నాను. తయారీ రంగంలో భారత్ చాలా మెరుగైంది. సొంతగా ఇక్కడే కార్‌లు తయారు చేసుకునే స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఆ కార్‌ల అమ్మకాలూ బాగున్నాయి. విద్యుత్ వాహనాల విషయంలోనూ భారత్‌లో ఆర్ అండ్ డీ సానుకూలంగా ఉంది"
- అనీశ్ షా, మహీంద్రా గ్రూప్ గ్రూప్ సీఈవో