AP Telangana Weather: హైదరాబాద్ గరం గరం - భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు: IMD అలర్ట్
Hyderabad Temperature: ఎండలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నారు. గత వారం వాన చినుకులతో ఉపశమనం పొందిన తెలుగు రాష్ట్రాల ప్రజలు 41 డిగ్రీలు ఎండలకు ఇబ్బంది పడుతున్నారు.
Heatwaves in Telangana and AP, Temperature: అకాల వర్షాలతో వారం రోజులు ఊరట పొందిన హైదరాబాద్ వాసులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భానుడి ప్రతాపం తట్టుకోలేకపోతున్నారు. గత రెండు రోజుల్లోనే పగటి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు పెరిగాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ఎండలు మండుతున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, వేడి గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో, నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో సైతం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడి, ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో ముఖ్యంగా రాయలసీమ మండిపోతోంది. రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అంచనా వేశారు. గత ఏడాది తరహాలోనే ఈసారి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వయోవృద్ధులు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. వీలైతే వెంట గొడుగు తీసుకువెళ్లడం మంచిది.
భారీగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు..
Telangana Weather- తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చిరించింది. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవత్ర కనిపించగా.. గత వారం మాత్రం అకాలవర్షాలతో ప్రజలు రిలాక్స్ అయ్యారు. దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి.
హైదరాబాద్ లో మార్చి నెలలో రెండోసారి పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. అత్యధికంగా సరూర్ నగర్‌లో 40.7, గోషామహల్, సికింద్రాబాద్ లలో 40.4 డిగ్రీలు, ఉప్పల్‌లో 40.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతతో నగరవాసులు ఎండలకు అల్లాడిపోతున్నారు. రాత్రి పూట సైతం ఉక్కపోత తప్పడం లేదు. అందుకే ప్రజలు నీళ్లు ఎక్కువగా తాగాలని, బయటకు వెళ్లేవారు కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఏపీలోనూ పొడి వాతావరణం
ఏపీలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ దిశగా, లేక నైరుతి దిశ వైపు గాలులు వీచనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాలతో పోల్చితే రాయలసీమలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నంద్యాలలో 41 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కోస్తాంధ్రతో పాటు దక్షిణ కోస్తాంధ్రలోనూ వేడి గాలుల ప్రభావం ఉంటుంది. 2 నుంచి 3 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ ఉందని, ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. రాయలసీమకు స్వల్ప వర్ష సూచన ఉంది. అదే సమయంలో కొన్నిచోట్ల వేడి గాలుల ప్రభావంతో ఉక్కపోత అధికం కానుంది. రాత్రివేళ సైతం వేడితో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.