India-Canada Row: బంధాలు మెరుగుపరిచేందుకే భారత్ కు వచ్చాను- కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్
India-Canada Row: బంధాలు మెరుగుపరిచేందుకే దిల్లీకి వచ్చానని కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ అన్నారు.
భారత్, కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా కెనడా డిప్యూటీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ పీటర్ స్కాట్ దిల్లీలో జరుగుతున్న 'ఇండో-పసిఫిక్ ఆర్మీ చీఫ్స్ కాన్ఫరెన్స్'కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు. రెండు దేశాలు ఈ అంశంపై దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నాయని అన్నారు. అధికారులు, దేశాధినేతలు ఈ సమస్యపై చర్చించి పరిష్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. నిజ్జర్ హత్య ఇరు దేశాల సంబంధాలను దెబ్బ తీస్తుందా అని విలేకరులు ప్రశ్నించగా పీటర్ పై విధంగా స్పందించారు.
'నేను ఇరు దేశాల బంధాలను మెరుగుపరిచేందుకు ఇక్కడికి వచ్చాను. భారత ఆర్మీ చీఫ్‌తో జరిపిన సంభాషణలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాను. ఇది రెండు దేశాల ఆర్మీలకు సంబంధించిన విషయం కాదు. భారత, కెనడా ఆర్మీలు కలిసి పనిచేసే అవకాశం గురించి ఎదురుచూస్తున్నాం. ప్రస్తుత వివాదాన్ని రెండు దేశాల నాయకులు పరిష్కరించుకుంటారు. ఆర్మీకి సంబంధించిన విషయం కాదని ఇద్దరం అంగీకరించాం. మేము కేవలం ఆర్మీ పరస్పర సహకారం పెంచడం గురించి మాట్లాడుకున్నాం' అని పీటర్ స్కాట్ ఏబీపీ న్యూస్‌తో వెల్లడించారు. మేజర్ జనరల్ స్కాట్ మంగళవారం తొలుత భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో సమావేశమై మాట్లాడారు.
రెండు దేశాల ఆర్మీ-టు-ఆర్మీ లెవల్ బంధాలను మెరుగుపరిచేందుకు తాను దిల్లీకి వచ్చినట్లు స్కాట్ వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్, కెనడాల మధ్య ఇంకా మంచి పరస్పర సహకారం ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 'పార్లమెంటులో మా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటన గురించి నాకు తెలుసు. కేసు దర్యాప్తులో భారత్ సహకరించాలని ఆయన కోరారు. కానీ ఇండో పసిఫిక్ సదస్సులో దాని ప్రభావం ఏమీ ఉండదు. మేము కేవలం సైన్యాల మధ్య సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఇక్కడికి వచ్చాము. రెండు దేశాల ప్రభుత్వాలు ఆ సమస్యను పరిష్కరించుకుంటాయి' అని స్కాట్ ఏబీపీ న్యూస్ తో తెలిపారు.
భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకంటే..?
ఈ ఏడాది జూన్‌లో కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్ టైగర్స్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా, భారత్‌ల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని తమకు విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ ఆరోపించారు. దీనిపై భారత్ మండిపడింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు కెనడా నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని భారత్ ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు రాయబారులను బహిష్కరించాయి. కెనడా పౌరులకు వీసాల జారీని కూడా భారత ప్రభుత్వం నిలిపేసింది. కెనడా ఇప్పటికీ ప్రభుత్వం తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు.