Anil Vij - Amit Shah: మంత్రిగారూ అంత పెద్ద స్పీచ్ అవసరమా? సూటిగా సుత్తిలేకుండా చెప్పండి - అమిత్ షా వార్నింగ్
Anil Vij - Amit Shah: హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ సుదీర్ఘ ప్రసంగాన్ని అమిత్‌షా అడ్డుకున్నారు.
Anil Vij - Amit Shah:
అనిల్ విజ్‌పై అమిత్ షా అసహనం..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా..హరియాణా హోం మినిస్టర్ అనిల్ విజ్‌ను వారించారు. చింతన్ శివిర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అనిల్ విజ్‌ను పదేపదే అడ్డుకున్నారు అమిత్ షా. దాదాపు ఎనిమిదన్నర నిముషాల పాటు మాట్లాడగా...నాలుగు సార్లు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. స్పీచ్‌ను వీలైనంత వరకూ తగ్గించాలని కేవలం 5 నిముషాల సమయం మాత్రమే ఇచ్చామని తేల్చి చెప్పారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రసంగం చేశారు. అనిల్ విజ్ స్వాగతోపన్యాసం చేయగా...అమిత్ షా చివర్లో మాట్లాడారు. అమిత్ షా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు అనిల్ విజ్. మొదటి 5 నిముషాల వరకూ బాగానే మాట్లాడినా ఆ తరవాత...ఆయన ఉన్నట్టుండి హరియాణా చరిత్ర గురించి చర్చించటం మొదలు పెట్టారు. హరిత విప్లవం సహా..వారం వారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం గురించీ మాట్లాడారు. అనిల్ విజ్‌కు కాస్త దూరంలో కూర్చున్నారు అమిత్ షా. కాసేపు ఓపిక పట్టిన షా...వెంటనే అనిల్ విజ్‌కు నోట్ పంపారు. స్పీచ్ తొందరగా ముగిస్తే కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం సజావుగా సాగుతుందని చెప్పారు. అప్పటికి కూడా అనిల్ విజ్ తన ప్రసంగాన్ని ఆపలేదు.
అమిత్ షా తన ముందున్న మైక్‌ని ఆన్ చేసి దానిపై కొట్టారు. అలా అయినా అనిల్ విజ్‌కు అర్థమవుతుందని అనుకున్నారు.
అయినా...అనిల్ స్పీచ్‌ను ఆపలేదు. ఇలా కుదరదనుకున్న అమిత్ షా వెంటనే మైక్ ఆన్ చేసి "అనిల్ జీ మీకు 5 నిముషాలు మాత్రమే టైమ్ ఇచ్చాం. మీరు ఇప్పటికే 8.30 నిముషాలు మాట్లాడారు. దయచేసి స్పీచ్ ఆపేయండి. పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చేందుకు ఇది సరైన వేదిక కాదు. కాస్త క్లుప్తంగా చెప్పండి" అని వారించారు. ఇంత చెప్పినా...అనిల్ విజ్ "ఇంకో పాయింట్ డిస్కస్ చేయాలండి. దయచేసి కాస్త సమయం ఇవ్వండి" అని రిక్వెస్ట్ చేశారు. ఆ తరవాత మళ్లీ సుదీర్ఘంగా ప్రసంగించారు అనిల్ విజ్. సహనం కోల్పోయిన అమిత్ షా "అనిల్ గారు క్షమించండి. ఇక కుదరదు. మీరు స్పీచ్‌ను ఆపేయాల్సిందే" అని గట్టిగా చెప్పారు. అప్పుడు కానీ..ఆయన ప్రసంగించటం ఆపలేదు.
వదంతులపై నిఘా పెట్టాలి: ప్రధాని
ఓ చిన్న వదంతు కూడా దేశానికి భారీగా నష్టం చేకూర్చే ప్రమాదముందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి వదంతులు వ్యాప్తి చేసే వాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న Chintan Shivir కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల పాటు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో ఈ సమావేశం సాగనుంది. ఈ సందర్భంగానే ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల గురించి ప్రస్తావించారు. "పౌరులు ఏదైనా సరే ఫార్వర్డ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా వాళ్లకు అవగాహన కల్పించాలి. అది నమ్మే ముందు వెరిఫై చేసుకోవాలనీ మనం చెప్పాలి" అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.