Gujrat Elections 2022: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఈసీ సీరియస్- ఐఏఎస్ అధికారిపై వేటు!
Gujrat Elections 2022: ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ కారణంగా ఐఏఎస్ అధికారిని విధుల నుంచి తొలగించింది ఈసీ.
Gujrat Elections 2022: గుజరాత్ ఎన్నికల విధులకు కేటాయించిన ఓ ఐఏఎస్ అధికారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌కు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారి అభిషేక్ సింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కారణంగా ఎన్నికల సంఘం ఆయన్ను సదరు విధుల నుంచి తొలగించినట్లు సమచాారం.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌ను ఈసీ.. గుజరాత్ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమించింది. అహ్మదాబాద్‌లో బాపునగర్, అసర్వా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన జనరల్ అబ్జర్వర్‌గా వెళ్లారు. అయితే ఈ విషయాన్ని తెలియజేస్తూ అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో అధికారిక వాహనం పక్కన నిల్చొన్న ఫోటో పెట్టారు. అంతేకాకుండా తన బృందంతో కలిసి ఉన్న రెండు ఫొటోలను పోస్ట్ చేశారు.
View this post on Instagram
ఈసీ సీరియస్
ఇది ఎన్నికల సంఘం దృష్టికి చేరింది. దీంతో ఈసీ.. అభిషేక్‌పై చర్యలు చేపట్టినట్లు సమాచారం. వెంటనే ఆయనకు కేటాయించిన విధుల నుంచి తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోకుండా అభిషేక్‌ను డీబార్ చేసినట్లు తెలుస్తోంది. తక్షణమే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించిందట. అభిషేక్ స్థానంలో మరో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.
షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.
డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.
Also Read: Shraddha Murder Case: శ్రద్ధా సిగరెట్ తాగిన ప్రాంతానికి పోలీసుల ప్రత్యేక బృందం!