మళ్లీ బీజేపీ గూటికి గాలి జనార్ధన్ రెడ్డి, లోక్‌సభ ఎన్నికల ముందు కీలక నిర్ణయం
Gali Janardhana Reddy: లోక్‌సభ ఎన్నికల ముందు గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు.
Gali Janardhana Reddy Rejoins BJP: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ రారాజుగా పేరు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragati Paksha) పార్టీని స్థాపించారు. అంతకు ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు బీజేపీతోనే సన్నిహితంగా ఉన్న ఆయన ఇలా ప్రత్యేకంగా పార్టీ పెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మళ్లీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. భార్య అరుణ లక్ష్మితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులతో సహా బీజేపీ సీనియర్ నేత యడియూరప్పని కలిశారు. ఆయన సమక్షంలోనే బీజేపీలో చేరారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్రహోం మంత్రి అమిత్‌షాని కలిశారు గాలి జనార్ధన్ రెడ్డి. అయితే..ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన మద్దతునిచ్చారు. ఇప్పుడు పూర్తిగా బీజేపీలో పార్టీని విలీనం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలన్న ఆకాంక్షతోనే బీజేపీలో చేరినట్టు చెప్పారు.
"ఇటీవలే ఢిల్లీలో కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాను. ఆ సమయంలోనే నా రాజకీయ భవిష్యత్ గురించి చర్చ జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బయట నుంచి మద్దతునిచ్చే బదులు పూర్తిగా బీజేపీలో చేరిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నా రాజకీయ ప్రస్థానం మొదలైందే బీజేపీ నుంచి. అందుకే ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ పార్టీలో చేరుతున్నాను. నేనింకేదో ఆశించి మాత్రం పార్టీలో చేరడం లేదు. నిజాయతీగా పని చేసేందుకే వచ్చాను. "
- గాలి జనార్ధన్ రెడ్డి