Heat Waves: కోట్లాది మంది చిన్నారులకు ఎండల ముప్పు, హెచ్చరించిన యునిసెఫ్
Extreme Heat: ఆసియాలో విపరీతమైన ఎండల కారణంగా కోట్లాది మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.
Extreme Heat in Asia: తూర్పు ఆసియాతో పాటు పసిఫిక్ ప్రాంతంలో విపరీతమైన వేడి గాలులు వీచే ప్రమాదముందని, ఈ కారణంగా భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యే అవకాశముందని ఐక్యరాజ్య సమితి సంచలన విషయం వెల్లడించింది. రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతాల్లో అనూహ్యంగా పెరుగుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ప్రమాదముందని తేల్చి చెప్పింది. కనీసం 24.3 కోట్ల మంది పిల్లలపై ఈ వేడిగాలుల ఎఫెక్ట్ ఉంటుందని అంచనా వేసింది. ఈ వేసవిలో గతంతో పోల్చి చూస్తే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్కపోత కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శరీరం చల్లబడే అవకాశమే ఉండదని, పెద్దల కన్నా చిన్నారులపై ఈ ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదముందని వివరించింది. United Nations Children's Fund ఈ విషయం వెల్లడించింది. వాతావరణ మార్పుల ప్రభావం ఎప్పుడైనా చిన్నారులపైనే ముందుగా కనిపిస్తుందని తెలిపింది. ఈ వడగాలుల నుంచి వాళ్లను కాపాడుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. దాదాపు పదేళ్లుగా మార్చి నెలలో ఒక సంవత్సరానికి మరో సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పసిఫిక్‌తో పాటు తూర్పు ఆసియాలో వాతావరణ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆగ్నేయాసియాలో అధికారులు అప్రమత్తమయ్యారు. వడగాలుల నుంచి తట్టుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. థాయ్‌లాండ్‌లోని ప్రజారోగ్య శాఖ అందరినీ అప్రమత్తం చేసింది. ఈ వారం రోజుల్లోనే వడదెబ్బతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
యునిసెఫ్ హెచ్చరికలు..
అటు ఫిలిప్పైన్స్‌లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల స్కూల్స్ మూసేశారు. ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఈ ఏడాది ఇక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదముందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని వెల్లడించింది. ఇళ్లలో ఎయిర్ కూలర్స్ పెట్టుకుని వాతావరణం చల్లబడేలా చూసుకోవాలని సూచించింది. ఆరుబయట ఆడుకోకుండా ఇంట్లోనే ఆడిపించాలని చెప్పింది. పిల్లలకు వదులైన దుస్తులు వేయాలని సూచనలు చేసింది. ఏ మాత్రం ఆరోగ్యంలో తేడా వచ్చినా వెంటనే హాస్పిటల్‌లో చేర్చాలని వెల్లడించింది. యునిసెఫ్ అంచనాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది చిన్నారులు 2050 నాటికి వడగాలుల ధాటికి అల్లాడిపోతారని తేలింది. గాల్లోకి భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని వివరించింది. గతంతో పోల్చి చూస్తే ఈ సారి భారత్‌లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధాన నగరాల్లో ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సగటున 38 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఇక వడగాలుల ధాటికీ అందరూ అల్లాడిపోతున్నారు. వడ దెబ్బ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఏసీలు,కూలర్లు వాడుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కొబ్బరి బోండాలు, కూల్‌డ్రింక్స్ తాగుతూ కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరి కొద్ది రోజుల పాటు పరిస్థితులు ఇలాగే ఉంటాయని IMD హెచ్చరించడం మరింత ఆందోళనకరంగా మారింది.
Also Read: ఐఫోన్ యూజర్స్‌కి యాపిల్ కంపెనీ అలెర్ట్, పెగాసస్ తరహా మాల్‌వేర్ దాడి జరగొచ్చని వార్నింగ్