హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుల హంగామా, ఏం జరిగిందంటే?
Huzurabad News: హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు హల్ చల్ చేశారు. అన్నదాత సీడ్ కంపెనీ యజమానిపై దుర్భాషలాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Huzurabad News: హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు హల్ చల్ చేశారు. డబ్బుల విషయంలో అన్నదాత సీడ్ కంపెనీ యజమాని అయిన శ్రీనివాస రావుపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బుల విషయంలో అన్నదాత సీడ్ కంపెనీకి టీఆర్ఎస్ నాయకులు తాళం వేశారని, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నదాత సీడ్ కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస రావు ఫిర్యాదుతో హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఆలస్యంగా వెలుగులోకి
అయితే గత రెండు రోజుల ముందే ఇరు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ విషయంపై ఏసీపీ కార్యాలయంలో రాజీ చేసేందుకు ఏసీపీ వెంకట్ రెడ్డి యత్నించారు. ఈ నెల 2వ తేదీన జరిగిన రాజీ యత్నంలో ఏసీపీ వెంకట్ రెడ్డి ముందే.. టీఆర్ఎస్ నాయకులు.. హుజూరాబాద్ సీఐ సహా అన్నదాత సీడ్ కంపెనీ యజమాని శ్రీనివాసరావుపై దుర్భాషలాడారు. ఏసీపీ ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా టీఆర్ఎస్ నాయకులు రాజీకీ రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు దుర్భాషలాడుతూ శ్రీనివాసరావుతో అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నాయకులు ఆయుధాలతో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నాయకులు ఆయుధాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మర్రి వెంకట స్వామి ఆరోపించారు. ఏసీపీ ఎదుటే సీడ్ కంపెనీ యజమానిని ఆయుధాలతో బెదిరించారని సీపీఎం నాయకులు అంటున్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండే అంశం చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ లో పలువురు నాయకులు, కార్యకర్తల వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్ వ్యాప్తంగా ఇద్దరికి మాత్రమే ఆయుధాల అనుమతి ఉందని ఇటీవల సీపీ సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
హుజూరాబాద్ పోలీసుల వివరణ
హుజూరాబాద్ లోని నాయకుల వద్ద అక్రమంగా ఆయుధాలు ఉన్నాయన్న మర్రి వెంకటస్వామి ఆరోపణలపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఎవరి వద్ద ఆయుధాలు లేవని స్పష్టం చేశారు. మర్రి వెంకటస్వామి ప్రెస్ మీట్ లో తెలిపిన అక్రమ ఆయుధాలు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. అన్నదాత సీడ్స్ లోకి అక్రమంగా చొరబడి దుర్భాషలాడారని అనంతరం తాలం వేసినట్లు తమకు ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు అందినట్లు హుజూరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పలువురిని విచారించినట్లు తెలిపారు. అన్నదాత సీడ్స్ కంపెనీ ఓనర్ బోయినపల్లి శ్రీనివాసరావుకు.. తక్కల్లపల్లి సత్యనారాయణకు మధ్య హనుమకొండలోని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వివాదాలు ఉన్నాయని సత్యనారాయణ రావుకి శ్రీనివాసరావు డబ్బులు ఇవ్వవలసి ఉందని దీని గురించే గతంలో కొన్నిసార్లు పంచాయతీలు జరిగాయని అందులో భాగంగానే అక్రమంగా శ్రీనివాసరావుకు చెందిన అన్నదాత సీడ్స్ ప్లాంట్ లోకి వచ్చారని దర్యాప్తులో తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు..
ఈ నెల రెండో తేదీన ఇరు వర్గాల వారు ఏసీపీ కార్యాలయానికి వచ్చి ఎవరి వాదనలు వారు వినిపించారని, అదే సమయంలో వాగ్వాదం జరిగిందని ఏసీపీ వారిని వారించి అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారని పోలీసులు వెల్లడించారు. ఇరు వర్గాల వారు దర్యాప్తుకు సహకరించాల్సిందిగా ఏసీపీ కోరినట్లు తెలిపారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.