Bhatti Vikramarka: డిసెంబర్ 28 నుంచి కీలక పథకం అమలు- లీక్ ఇచ్చిన భట్టి విక్రమార్క
Free Gas Scheme In Telangana: డిసెంబర్ 28 నుంచి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క .
తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో చాలా స్పీడ్‌గా ఉంది. వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల టైంలో ప్రచారం చేసింది. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన నాడే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఫైల్‌పై సంతకం చేశారు.
ఆ పథకాన్ని సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న స్టార్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసుకునే వెసులుబాటు కల్పించారు. సిటీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లప పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే వీలు కల్పించారు. దీన్ని ఐదు రోజుల పాటు ట్రయల్‌రన్ బేస్‌మీద రన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ పథకం లబ్ధిదారులకు కార్డులు ఇవ్వబోతున్నారు. మహలక్ష్మి కార్డుల పేరుతో ఇవ్వనున్నారు.
మహలక్ష్మి పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన రోజునే ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతూ ఇచ్చే పథకాన్ని కూడా అమలు పరిచారు. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షలు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. ఆరు గ్యారంటీల్లో మరికొన్ని కీలకమైన పథకాలు అమలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటిపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం దీనిపై ఓ లీకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా డిసెంబర్ 28వ తేదీన మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఆగిపోయిన రైతుబంధు కార్యక్రమంను తిరిగి ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా రైతు భరోసా అమలు చేయడానికి విధివిధానాలు త్వరలోనే ఖరారు చేస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు.
డిసెంబర్ 28 ఏ పథకం అమలు చేస్తారో అన్న ఆసక్తి మొదలైంది. గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. దీనిపై ఇప్పటికే హడావుడి మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా కేవైసీలు అప్‌డేట్ చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున ప్రారంభించే పథకం ఇదేనా అనే అనుమానం కలుగుతోంది. మరోవైపు మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయల పథకం విధివిధానాల కోసం కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై ఏమైనా కదలిక ఉంటుందా అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న మహిళలు.. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే పథకం ఏమైన ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారు. దాన్ని బట్టి ఇంటి బడ్జెట్ సర్దుబాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.